రాజకీయాల్లో.. వ్యాపారాల్లో ఇగోలకు పోకూడదు. పోతే ఎంత నష్టం జరగాలో అంతే జరుగుతుంది. చివరికి సర్వం కోల్పోతాము.. ఇగో శాటిస్ఫేక్షన్ కూడా మిగలదు. దీనికి ఇప్పుడు ప్రత్యక్ష సాక్ష్యం .. ఎలన్ మస్క్. ఎడిట్ బటన్ ఆప్షన్ గురించి లొల్లి పెట్టుకుని ట్విట్టర్‌ను కొనేయాలని ఉబలాటపడ్డారు. చివరికి నకిలీ ఖాతాల పేరుతో తప్పించుకుందామని ట్రై చేసినా… తప్పు దిద్దుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. బలవంతంగా ట్విట్టర్ కొనాల్సి వచ్చింది. ట్విట్టర్ అంతర్గత వ్యవహారాల గురించి .. ఆదాయ వ్యయాల గురించి బాగా తెలిసిందేమో కానీ కొంటారా లేదా అని పట్టుబట్టి మరీ మస్క్ చేత కొనిపించేసింది ట్విట్టర్ టీమ్. ఇప్పుడు కిందా మీదా పడుతున్నాడు.
ఉద్యోగుల్ని పీకేశాడు. కొంత మందిని మళ్లీ మీరు కావాలంటూ తీసుకుంటున్నారు. బ్లూ టిక్ల పేరుతో వ్యాపారం చేద్దామనుకున్నారు. అదీ రివర్స్ అయింది. ఎంత అయిందంటే.. ఇక ట్విట్టర్ జోలికి వెళ్లకపోవడమే మంచిదని వ్యాపార సంస్థలు అనుకునేంతగా. ముందూ వెనుకా చూసుకోకుండా బ్లూటిక్‌లు అమ్ముకోవడానికి.. ఎనిమిది డాలర్ల కోసం కక్కుర్తి పడిన ఫలితం.. ట్విట్టర్ .. ఏళ్ల తరబడి నిర్మించుకున్న పునాదుల్ని కదిలించేలా చేసింది. ట్విట్టర్‌ను నమ్మినందుకు బడా వ్యాపార సంస్థలు నానా తిప్పలు పడుతున్నాయి. ఇప్పటికప్పుడు తప్పు దిద్దుకున్నా.. ఇది ట్విట్టర్ పతనానికి నాంది లాంటిదే.
ఎలన్ మస్క్ ట్విట్టర్ ను కొనేందుకు తాను ఖర్చు పెట్టిన మొత్తాన్ని వెంటనే.. వెనక్కి తెచ్చుకోవాలని ఉబలాటపడుతున్నారు. ఉద్యోగుల్ని బెదిరిస్తున్నారు. వారు ఉద్యోగం మాత్రమే చేస్తారు కానీ.. మస్క్ ఎంత పెట్టి కొన్నాడో అంతకు అంత అప్పటికప్పుడు తెచ్చి పెట్టలేరు కదా.. ఎన్నో వ్యాపార సంస్థలను పై స్థాయికి తీసుకెళ్లిన మస్క్‌కి ఇది తెలియనిది కాదు. కానీ ఎందుకో కానీ ట్విట్టర్ విషయంలో ఆయన వేస్తున్న అడుగులు మాత్రం.. ఏ మాత్రం అవగాహన లేని వ్యాపారవేత్త వేస్తున్నట్లుగానే ఉన్నాయి.
కారణం ఏదైనా ఇప్పుడు ఎలన్ మస్క్ .. పతనావస్థలో ఉన్నారు. పట్టుదలకు పోయి ట్విట్టర్‌ను కొని.. భారీగా టెన్షన్ పడటమే కాదు.. నష్టపోతున్నారు. ఇప్పటికైతే.. ట్విట్టర్ ను ఎంతో కొంత నష్టాన్ని వదిలించుకుని మళ్లీ ప్రొఫెషనల్స్ చేతుల్లో పెడితే సరి.. లేకపోతే.. మస్క్ .. దివాలా ఖాతాలో చేరినా ఆశ్చర్యం ఉండదనేది అమెరికాలో నిపుణుల మాట.