ఎలన్ మస్క్ దాదాపుగా మూడున్నర లక్షల కోట్లకు ట్విట్టర్‌ను కొనేయాలని డిసైడ్ అయ్యారు. దానికి డీల్ ఓకే అయింది. అయితే ఇప్పుడు అంత పెద్ద మొత్తం పెట్టి ట్విట్టర్ ను కొనడం దండగని అనుకుంటున్నారేమో కానీ.. ఒప్పందాన్ని హోల్డ్‌లో పెట్టేసి.. ట్విట్టర్‌పై నిందలేయడం ప్రారంభించారు. స్పామ్ , నకిలీ ఖాతాల పేరుతో రచ్చ ప్రారంభించారు. ట్విట్టర్‌ను దెబ్బతీసే వ్యూహం అమలు చేస్తున్నారు. అయితే.. ఆయన ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా వదిలి పెట్టే ప్రసక్తే లేదని.. అన్నీ చూసుకునే ఆయన కొనుగోలు ఒప్పందం చేసుకున్నారని ట్విట్టర్ బోర్డు స్పష్టం చేసింది.
ఇప్పుడు లేని పోని పరిశీలనల పేరుతో కొనుగోలు నుంచి వెనక్కి తగ్గితే ఊరుకునేది లేదంటున్నారు. నిజానికి ట్విట్టర్ ను మస్క్ కొనుగోలు చేయడంపై మొదట్లో వ్యతిరేక వ్యక్తమయింది. ఆయన చేతికి ట్విట్టర్ వెళ్లకూడదని బోర్డు ప్రయత్నించింది. కానీ మస్క్ తిరుగులేని ఆఫర్ ఇవ్వడంతో వాటాదారులు అంగీకరించారు. కానీ ఇప్పుడు మొత్తానికే తేడా కొట్టింది. ముందూ వెనుకా చూసుకోకుండా తాను ఆఫర్ ఇచ్చేశానేమో అని మస్క్ అనుకుంటున్నారేమో కానీ… వెనక్కి తగ్గుతున్నారు. ఇప్పుడు చెప్పినట్లుగా మూడున్నర లక్షల కోట్లు కట్టి కొనకపోతే కోర్టుకెళ్లి మరీ కొనిపిస్తామని ట్విట్టర్ హెచ్చరికలు జారీ చేస్తోంది.
ఒప్పందంలో ఎవరు వెనక్కి తగ్గినా బిలియన్ డాలర్లు పరిహారం ఇవ్వాలన్న నిబంధన ఉంది. అంటే మన రూపాయిల్లో దాదాపుగా ఏడు వేల ఎనిమిది వందల కోట్లు. మూడున్నర లక్షల కోట్లు పెట్టి కొని ట్విట్టర్‌ను నెత్తి మీద పెట్టుకోవడం కన్నా ఏడున్నర వేల కోట్లతో ఈ గండం నుంచి బయటపడితే బెటర్ అని మస్క్ అనుకుంటే ఆ మొత్తం కట్టేసి బయటపడే అవకాశం ఉంది. లేకపోతే మొత్తం కొనుగోలుకు సిద్ధపడాలి. అందరూ ఉబ్బేశారని ఆవేశపడిన మస్క్‌కు ఇప్పుడు చెప్పుకోలేని గడ్డు పరిస్థితి ఎదురవుతోంది.