సొంత ఇల్లు అనేది ప్రతి మధ్యతరగతి కుటుంబానికి ఓ డ్రీమ్. ఇప్పుడు జీవితాంతం కష్టపడి.. చరమాంకంలో ఇల్లు కొనాలని ఎవరూ అనుకోవడం లేదు. కెరీర్ ప్రారంభంలోనే మంచి ఇల్లు కొనేసి కావాలంటే ఇరవై ఏళ్లు ఈఎంఐ కట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో వారు చేస్తున్న కొన్ని తప్పుల వల్ల తీవ్రంగా నష్టపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తమ ఆదాయాన్ని, ఆదాయ పెరుగుదల అంచనాలను అతిగా వేసుకుని ఇంటిపై ఎక్కువ బడ్జెట్ పెట్టేస్తున్నారు. ఫలితంగా మధ్యలో చేతులెతేస్తున్నారు. దీని వల్ల రెండు రకాలుగా నష్టపోతున్నారు. ఈ పరిస్థతిని అధిగమించాలంటే.. తీసుకోవాల్సిన జాగ్రత్త.. ఆదాయం అంచనా వేసుకుని అందులో ఇంటి ఈఎంఐ.. ముఫ్పై శాతం కంటే ఎక్కువ లేకుండా చూసుకోవడం.
ఉదాహరణకు లక్ష రూపాయల జీతం వస్తోందంటే.. ముఫ్పై వేలు మాత్రమే ఈఎంఐకి కట్టేలా హోమ్ లోను తీసుకోవడం అన్నింటి కంటే ఉత్తమం. ఎందుకంటే జీవితంలో జీతం ఖర్చుపెట్టేందుకు హోమ్ లోన్ ఈఎంఐ ఒక్కటే కాదు…చాలా ఉంటాయి.అన్ని రకాల అవసరాలను తీర్చుకోవడానికి ఇతర ప్రణాళికలకు డబ్బు ఉంచుకోవాలి. అందుకే ఆదాయంలో ముఫ్ఫై శాతం మాత్రమే హోమ్ లోన్ ఈఎంఐకు సరిపడేలా లోన్ తీసుకుంటే ఎప్పటికీ బర్డెన్ కాదు. ఆస్తిని కాపాడుకోవచ్చు. అదే సమయంలో అదే మొదటి ఇల్లు అయితే అందులోనే నివాసం ఉండేలా కొనుగోలు చేసుకుంటే ఇంటి అద్దె కూడా మిగులుతుంది.
యువత తమ ఆదాయం పెరుగుతుందని అంచనా వేసుకుని ఎక్కువగా అప్పులు చేస్తున్నారు. హోంలోన్ ఇప్పుడు తీసుకుంటే.. .జీతాలు క్రమంగా పెరుగుతూ ఉంటాయి కానీ ఈఎంఐ పెరగదని కొంత మంది గుర్తు చేస్తున్నారు. అది నిజమే కాీ.. ఆదాయం పెంపు విషయంలో చాలా జాగ్రత్తగా అంచనాలు వేసుకోవాల్సి ఉంటుంది. ఆదాయం ఇంత మొత్తంలో పెరుగుతుందని అంచనా వేయడం కన్నా.. ఇప్పుడు ఉన్న ఆదాయాన్నే అంచనాగా వేసుకుని ఇల్లు కొనుక్కోవాలి. పెరిగిన ఆదాయాన్ని బట్టి.. తర్వాత కావాలంటే అదునపు చెల్లింపులు చేయడమో.. ఈఎంఐ పెంచుకోవడమో చేయవచ్చు. కానీ ముందుగానే పెరుగుతుందని భారం పెంచుకోవడం వల్ల సమస్యలు వస్తాయి.