జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ గురించి అప్డేట్స్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురచూస్తున్నారు. హీరోలు ఒకే మరి వారి సరసన ఎవరు నటిస్తున్నారనే విషయంపై క్లారిటీ లేదు. ఈ మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలను పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో చరణ్ సరసన అలియా భట్, ఎన్టీఆర్ సరసన డైసీ ఎడ్గర్ జోన్స్ నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే డైసీ జోన్స్ కొన్ని కారణాల వల్ల ‘ఆర్ఆర్ఆర్’ నుంచి తప్పుకుంది. ‘కొన్ని అనివార్య కారణాల వల్ల డైసీ ఎడ్గర్ జోన్స్ ఆర్ఆర్ఆర్లో పని చేయడం లేదు. ఆమెకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాము’ అంటూ ఆర్ఆర్ఆర్ టీమ్ కొన్ని రోజుల క్రితం తమ ట్వీట్ చేసింది.
దీంతో రాజమౌళి ఎన్టీఆర్ కోసం హీరోయిన్ను మళ్లీ వెతకాల్సిన అవసరం వచ్చింది. ఫైనల్‌గా అమెరికాకు చెందిన నటి, సింగర్ ఎమ్మా రాబర్ట్స్‌ను ఎన్టీఆర్ సరసన నటింపజేసేందుకు ఫిక్స్ చేసినట్లు టాక్. ఎమ్మాను సంప్రదించి మాట్లాడారని వినికిడి. కానీ చిత్ర యూనిట్ నుంచి ఇంత వరకు అధికారికంగా ప్రకటన రాలేదు. 2001లో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఎమ్మా పలు మూవీలు, టీవీ షోలు, మ్యూజిక్ ఆల్బమ్స్‌లో నటించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బేనర్‌పై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 30,2020న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, తమిళ నటుడు సముద్ర ఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కీరవాణి సంగీతం అందించనున్నారు.