సుకుమార్ అంటేనే… లాజిక్కులతో మ్యాజిక్ చేసే దర్శకుడు. ఆర్య, ఆర్య 2, 100% లవ్… ఈ సినిమాలన్నీ సుక్కు లాజిక్కుల కెపాసిటీ ఏమిటో చూపించాయి. వన్ – నేనొక్కడినే అయితే పీక్స్ అనుకోవాలి. అయితే సుకుమార్‌లో ఎమోషనల్ యాంగిల్ కూడా ఉందని నాన్నకు ప్రేమతో చూస్తే అర్థం అవుతుంది. ఈ సినిమాలో లాజిక్కులు ఉన్నా… వాటితో పాటు సమానంగా ఎమోషన్స్ కనిపిస్తాయి. ఇప్పుడు రంగస్థలంలోనూ ఇలాంటి మ్యాజిక్కే చేయబోతున్నాడు సుకుమార్. రంగ స్థలం అనగానే ఇదో ప్రయోగాత్మక సినిమా అనుకొన్నారంతా. కానీ… పూర్తి కమర్షియల్ పంథాలో సుక్కు ఈ సినిమా తీయబోతున్నాడని తేలిపోయింది. సుక్కు శైలి ఫన్, లవ్ స్టోరీ ఈకథలో బాగా మేళవించాడని తెలుస్తోంది. ఎమోషన్స్ అయితే పీక్స్‌లోకి తీసుకెళ్లాడట. కొన్ని కొన్ని సన్నివేశాలు గుండె బరువెక్కేలా సాగాయని, కుటుంబ ప్రేక్షకులకు ఈ సినిమాని దగ్గర చేయడంలో ఈ సీన్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయని తెలుస్తోంది. క్లైమాక్స్ కూడా డిఫరెంట్‌గా రాసుకొన్నాడట సుకుమార్. అక్కడ కూడా యాక్షన్ పార్ట్‌ని బాగా తగ్గించి, ఎమోషన్స్‌కి ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తానికి చరణ్ నుంచి రాబోతున్న ఓ డిఫరెంట్ సినిమా ఇదన్న సంగతి అర్థమైపోతోంది. దానికి తగ్గట్టే చరణ్ గెటప్ కూడా కొత్తగా కనిపిస్తోంది. అదే కొత్తదనం కథలోనూ ఉండి, ఎమోషన్స్ వర్కవుట్ అయితే… చరణ్ ఖాతాలో మరో హిట్ పడిపోయినట్టే.