అచ్చెన్నాయుడు టీడీపీ కార్యకర్తల్ని అగౌరవపరిస్తే ఏ ఒక్క అధికారిని ఊరుకోబోమన్నారు. అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం మున్సిపల్ అధికారులపై బూతు భాషతో విరుచుకుపడ్డారు. అది వారి సహజ లక్షణం కాదు. తాము పడిన బాధల తాలూకా కోపం . ఆయా అధికారులు ఐదేళ్ల పాటు ఆకారణంగా… ప్రభుత్వపెద్దల మెప్పు కోసం ..తమపై పాల్పడిన వేధింపుల ఆగ్రహం అలా బయటకు వస్తోంది. సహజంగానే ఈ వ్యవహారం వివాదాస్పదమవుతుంది.
అలా చేసే వైసీపీ నేతలు ఓడిపోయారని… ఇప్పుడు టీడీపీ నేతలుకూడా అదే చేస్తున్నారని కొంత మంది సలహాలు,సూచనలు, హెచ్చరికలతో తెరపైకి వస్తున్నారు. కానీ ఆ ఉద్యోగ సంఘం ప్రతినిధులు మాత్రం బయటకు రావడం లేదు. గతంలో టీడీపీ నేతలు చిన్న మాట అన్నా సరే తొడలు కొట్టుకుంటూ బయటకు వచ్చేవారు. తాట తీస్తామనే హెచ్చరికలు జారీచేసేవారు. అందులో పోలీసు సంఘం ప్రతినిధులు కూడా ఉండేవారు.
మరి ఇప్పుడు కూడా టీడీపీ నేతలే అంటున్నారు. ఎందుకు బయటకు వచ్చి ఖండించలేకపోతున్నారు ?. గత ప్రభుత్వంలో ఉద్యోగుల్ని, ఉద్యోగ సంఘం నేతల్ని రాజకీయాల్ని వాడుకున్నట్లుగా ఏ పార్టీ వాడుకోలేదు. అలా వాడుకునేందుకు రాజకీయాల్లో జోక్యం చేసుకునే వారే అవకాశం కల్పించారు. ఇప్పుడు అది రివర్స్ అవుతోంది. వారి హక్కుల్ని కూడా ప్రశ్నించలేని స్థితికి తీసుకు వచ్చింది. ఇది పూర్తిగా వారి స్వార్థం వల్లనే వచ్చింది.