ఉద్యోగుల ఉద్యమానికి ప్రభుత్వం భయపడింది. ఇది క్రిస్టల్ క్లియర్. నిన్న మధ్యాహ్నం వరకూ బెదిరింపులతో పాటూ చేయాలనుకున్నవన్నీ చేసేసి చర్చలకు రాకుండా రెచ్చగొట్టేలా చేసిన ప్రభుత్వం సాయంత్రానికి మనసు మార్చుకుంది. తగ్గడానికి సిద్ధం చర్చలకు రావాలని బతిమాలుకుంది. చివరికి తగ్గడానికి సిద్ధమయింది. కానీ ఇక్కడా బేరాలుడుతోంది . తెగడం లేదు. కానీ ప్రభుత్వం వారు అడిగినవన్నీ ఇచ్చి అయినా సరే సమ్మెకు వెళ్లకుండా చేయాలని అనుకుంటోంది. అందుకే ఇప్పుడు బాధ్యత అంతా ఉద్యోగ సంఘ నేతలపైనే ఉంది.
ఇప్పటికే సోషల్ మీడియాలో ఓ సెటైర్ వైరల్ అవుతోంది. జీతం పెంచమని అడగడం కాదు పాత జీతాలే ఇవ్వమని ఉద్యోగులు ప్రభుత్వం కాళ్లావేళ్లా పడుతున్నారు.. అదే సీఎం జగన్ గొప్పతనం అని చెబుతున్నారు. ఇప్పుడు ఉద్యోగులు కూడా తమకు కత్తిరించిన హెచ్ఆర్ఏలు అలెవెన్స్లు సాధించుకోవడం గొప్ప కాదు. తమ న్యాయబద్ధమైన డిమాండ్లు మొత్తాన్ని సాధిస్తేనే గొప్ప విషయం. అంతే కానీ ప్రభుత్వం వేసే అరకొర ఆఫర్లకు ఆశపడితే ఉద్యోగ వర్గాలకు తీవ్ర నష్టం జరుగుతుంది.
ఉద్యోగ సంఘం నేతలకు ప్రభుత్వ ముఖ్యలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నది నిజం. ఆ విషయాన్ని ఎవరూ కాదనలేరు. పీఆర్సీ ప్రకటించినప్పుడు చప్పట్లు కొట్టి వచ్చారు. తర్వాత ఉద్యోగుల ఒత్తిడితో ఉద్యమంలోకి వచ్చారు. చలో విజయవాడకు ఉద్యోగ సంఘం నేతలు పిలుపు మాత్రమే ఇచ్చారు. కానీ ఉద్యోగులు ఉద్యమం మీద వేసుకుని వచ్చారు. అంటే ఉద్యమం ఉద్యోగుల చేతుల్లో ఉంది. ఇప్పుడు ఉద్యోగ నేతలు వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నుంచి డిమాండ్లు సాధించి చూపెట్టాల్సి ఉంది. అంతే కానీ ఏదో ఒకటి అని రాజీ పడితే.. ఇంతకు ముందెన్నడూ జరగనంత నష్టం ఉద్యోగవర్గాలకు జరుగుతుంది.