ఉద్యోగులంతా ఉద్యమంలో ఉన్న సమయంలో ప్రజల దృష్టి మరల్చేందుకే కొత్త జిల్లాలంటూ ప్రభుత్వం ప్రకటనలు చేసిందని ఆరోపణలు వస్తున్న సమయంలో ఉద్యోగ సంఘాలు భిన్నంగా స్పందించాయి. ఐఏఎస్లు మినహా ఉద్యోగలంతా సమ్మెలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అయితే సమ్మెలోకి వెళ్లేలోపు ఉద్యోగులందరూ తమ విధులు తాము నిర్వహిస్తాని.. కొత్త జిల్లా ప్రక్రియకు శక్తివంచన లేకుండా సాయం చేస్తామని ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు.
సమ్మెలోకి వెళ్లనంత వరకూ ప్రభుత్వ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం రాదన్నారు. అయితే పనిచేయాల్సిందేనని ఉద్యోగులపై అధికారులు ఒత్తిడి తేవొద్దని సూచించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? అని ప్రశ్నించారు. ఈ నెల జీతాలు రాకుండా ఉండేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. జీతాలు రాకుంటే ఉద్యోగులు తిరగబడతారని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఉద్యోగులకు జీతాలు రాకుంటే ప్రభుత్వమే బాధ్యత వహించాలని బొప్పరాజు మండిపడ్డారు. జిల్లాల ఏర్పాటు ఓ సుదీర్ఘమైన ప్రక్రియ. ఉద్యోగులు లేకుండా పని జరగదు.
సమ్మెకు వెళ్తున్నారని తెలిసి కూడా ప్రభుత్వం ఈ ప్రక్రియను తెర ముందుకు తెచ్చింది. ఇప్పుడు ఉద్యోగులు డిమాండ్ల మేరకు కనీసం జీవో వెనక్కి తీసుకోకపోతే.. వారు సమ్మెకు వెళ్లడం ఖాయమే. అదే జరిగితే జిల్లాల ప్రక్రియ ఆగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం … జిల్లాల ప్రక్రియపై ఎందుకు దూకుడు ప్రదర్శిస్తుందో చాలా మందికి అర్థం కావడం లేదు.