పీఆర్సీ ప్రకటించినప్పుడు చప్పట్లు కొట్టిన ఉద్యోగ సంఘాలకు ఇప్పుడు చెమటలు పడుతున్నాయి. ఆ పీఆర్సీతో జీవో విడుదల చేయవద్దని కోరుతున్నారు. హెచ్ఆర్ఏ సంగతి తేల్చాలంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల నేతలు సీఎం జగన్ పీఆర్సీ ప్రకటించగానే చప్పట్లు కొట్టారు కానీ ఇప్పుడు ఆ పీఆర్సీతో జీవో జారీ చేయవద్దని ప్రభుత్వ పెద్దల్ని బతిమాలుతున్నారు. జీవో జారీ చేస్తే ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
ఫిట్మెంట్ తగ్గించినా ఒప్పుకున్నారు కానీ.. హెచ్ఆర్ఏ మాత్రం తగ్గించవద్దని కోరుతున్నారు. చీఫ్ సెక్రటరీ నేతృత్వంలోని కమిటీ హెచ్ఆర్ఏ తగ్గించాలని సిఫార్సు చేసింది. వాటినే అమలు చేస్తామని ప్రభుత్వం అంటోంది. ప్రస్తుతం ఉన్న వాటినే కొనసాగించాలని ఉద్యోగ సంఘ నేతలు కోరుతున్నారు. రెండు, మూడు రోజుల నుంచి ఉద్యోగ సంఘ నేతలు అదే పనిగా ఉన్నతాధికారులను కలుస్తున్నారు. కానీ ఎలాంటి పురోగతి లేదు.
రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ తిరిగుతున్నారు. ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం జీవో ఇస్తే సచివాలయ హెచ్వోడీ ఉద్యోగులు 22 శాతం, జిల్లా కేంద్రాల్లోని ఉద్యోగులు దాదాపు 12 శాతం మున్సిపాలిటీల్లోని ఉద్యోగులు 6.5శాతం, మండల కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు 4.5శాతం హెచ్ఆర్ఏ కోల్పోతారు. జీతం చాలా తగ్గిపోతుంది.అదే జరిగితే ఉద్యోగులు తమ ఆగ్రహాన్ని ముందు ఉద్యోగ సంఘాల నేతల మీద చూపిస్తారు. అందుకే వారు వణికిపోతున్నారు. జీవో ఇవ్వొద్దని బతిమాలుతున్నారు. అయితే ఇలా … కంగారు పెట్టి చివరికి అదే కొనసాగించి.. గొప్ప మేలు చేశామని చెప్పుకునే వ్యూహంలో ప్రభుత్వం ఉంది అని చాలా మంది కాస్త ధీమాగా ఉన్నారు.