ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర్నుంచీ చకచకా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు జగన్మోహన్ రెడ్డి. శాఖలవారీగా సమీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఏయే శాఖల్లో పనులు ఎంతెంత వరకూ వచ్చాయి, వాటిలో చెయ్యాల్సిన మార్పులూ తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు పలు సూచనలు కూడా చేస్తున్నారు. ఇదే సమయంలో… ఉన్నతాధికారులతో తనదైన శైలితో జగన్ వ్యవహరిస్తున్న తీరుపై ఉద్యోగ వర్గాలు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తుండటం విశేషం. సమీక్షల సమయంలో జగన్ మాట్లాడుతున్న తీరుపై ఐ.ఎ.ఎస్.లూ ఇతర అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తనకంటే పెద్దవారిని అన్నా అని సంభోదించి మాట్లాడటం జగన్ కి మొదట్నుంచీ అలవాటు. రివ్యూ మీటింగుల్లో కూడా అదే తరహాలో ఆయన మాట్లాడుతుండటం తమకు కొత్త అనుభూతిగా ఉందని ఓ ఉన్నతాధికారి అన్నారు. ఒక సమీక్షలో డి. సాంబశివరావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రారంభించబోతుంటే… అన్నా ఒక్క నిమిషం అంటూ జగన్ అన్నారు. గతంలో ఎవ్వరూ తమను ఇలా పిలిచింది లేదంటూ అధికారులు అంటున్నారు. సాధారణంగా ఇలాంటి సమావేశాల్లో, ఆయా శాఖల గురించి ముఖ్యమంత్రికి వివరిస్తున్నప్పుడు ఉన్నతాధికారులు నిలబడే మాట్లాతారు. సరిగ్గా అలానే సీఎం జగన్ ముందు కొందరు అధికారులు నిలబడి మాట్లాడబోతే… మనందరం ఒక కుటుంబంలో సభ్యులం. మీరు కూర్చునే చెప్పొచ్చు, నిలబడాల్సిన అవసరం లేదని జగన్ అన్నారు.
దివంగత వైయస్సార్ మాదిరిగానే మధ్యాహ్నం ఒంటిగంటన్నర వరకూ మాత్రమే రివ్యూలు నిర్వహిస్తున్నారు. భోజన సమయానికి తన దగ్గరున్న ఆఫీర్లతో కలిసి భోంచేద్దామని జగన్ అంటున్నారు. అంతేకాదు, కొన్ని సందర్భాల్లో మీటింగ్ మధ్యలో ఉన్నా… మీరు భోంచేసి రండి నేను వెయిట్ చేస్తా అని అధికారులకు సీఎం చెబుతున్నారు. ప్రభుత్వోద్యోగులంతా ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకూ మాత్రమే సెక్రటేరియట్ తో సహా అన్ని ఆఫీసుల్లో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యానికి జగన్ సూచించారు. సెలవు రోజుల్లో రివ్యూలు పెట్టొద్దని కూడా జగన్ ఆదేశించారు.
ఇంత కలుపుగోలుగా ఉంటూనే… అవినీతి లాంటి అంశాలపై తన వ్యవహార శైలి మరోలా ఉంటుందనే సంకేతాలూ ఇస్తున్నారు. ప్రభుత్వంలో ఏ స్థాయిలోనైనా అవినీతిని సహించేది లేదని అధికారులతో చెప్తున్నారు. నీటిపారుదల శాఖ రివ్యూలో జగన్ మాట్లాడుతూ… టెండరింగ్ విధానంలో ఎక్కడా చేతివాటానికి ఆస్కారం ఉండకూడదన్నారు. నేను ఏ ఒక్క కాంట్రాక్టర్ నుంచీ ఒక్క పైసా ఆశించడం లేదు, ఒకవేళ నేను ఏదో ఆశిస్తున్నట్టు మీద దృష్టికి వస్తే వెంటనే నేరుగా మీడియాకి చెప్పేయండి అంటూ అధికారులకు జగన్ చెప్పారు. గడచిన వారం రోజుల్లో ముఖ్యమంత్రి జగన్ తో పనిచేస్తుండటం తమకు కొత్త అనుభవాన్ని పంచుతోందని అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమను కుటుంబ సభ్యులుగా ఓన్ చేసుకున్న విధానం, జగన్ మాట తీరు, సమీక్ష సమావేశాల్లో అధికారులకు ఆయన ఇస్తున్న గౌరవం… ఇవన్నీ కొత్త అనుభూతులుగా అధికారులు ఫీల్ అవుతున్నారు. మొత్తానికి, తొలి వారం రోజుల్లోనే అధికార వర్గాల మనసుల్ని జగన్ గెలుచుకున్నారని చెప్పొచ్చు.