కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుని భక్తిభావాన్ని ప్రచారం చేయడానికి ఏర్పాటు చేసిన శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ అంతర్గత రాజకీయాలతో ఎన్నోసార్లు వివాదాలకెక్కింది. తాజాగా అక్కడ ఉద్యోగులు తమ .. ఉద్యోగానికి బదులుగా.. పోర్న్ సైట్స్ చూస్తూ కాలక్షేపం చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. అత్యంత భక్తితో విధులు నిర్వహించాల్సిన చోట.. ఈ పాడు పని చేస్తున్న ఉద్యోగులు ఒకరో ఇద్దరో కాదు.. దాదాపుగా పాతిక మంది ఉన్నట్లుగా తేలింది. ఎస్వీబీసీ చానల్లో శతమానం భవతి అనే ప్రోగ్రాం వస్తూంటుంది. పుట్టినరోజు శుభాకాంక్షలు అందులో చెబుతూంటారు. ఈ ప్రోగ్రామింగ్ చేసే యాంకర్‌కు.. మెయిల్ ద్వారా.. పోర్న్ సైట్ లింక్ పంపాడు ఎస్వీబీసీ ఉద్యోగి.
ఈ విషయాన్ని ఆధారాలతో టీటీడీ చైర్మన్, ఈవోకు ఫిర్యాదు చేశారు యాంకర్. వెంటనే టీటీడీ చైర్మన్, ఈవో విచారణకు ఆదేశించారు. టీటీడీ విజిలెన్స్, సైబర్ క్రైం అధికారుల సోదాలు చేసి ఎస్వీబీసీ ఆఫీసులో పోర్న్సైట్లు చూస్తున్న నలుగురు ఉద్యోగుల్ని గుర్తించారు. విధులు నిర్వర్తించకుండా ఇతర వీడియోలు చూస్తున్న.. మరో 25 మంది సిబ్బందిని గుర్తించారు. ఈ వ్యవహారం కలకలం రేపుతోంది. ఎస్వీబీసీ ఛానల్ ఆఫీస్ ఎదుట టీడీపీ కార్యకర్తలు ధర్నా చేసారు. ఎస్వీబీసీ పవిత్రతను దెబ్బతీస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. అయోధ్య రామ మందిరం లో భూమి పూజ లైవ్ పోగ్రామ్ ని ఎస్వీబీసీ ఛానెల్ లో ప్రసారం కూడా చేయలేదని.. ఇలాంటి పనులు చేస్తున్నారంటూ.. బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఎస్వీబీసీ చానల్ చైర్మన్ గా ఉన్న నటుడు ఫృధ్వీ ఓ ఉద్యోగితో అసభ్యంగా ప్రవర్తించి తన పదవి పోగొట్టుకున్నారు. ఇప్పుడు పోర్న్ సైట్ల వ్యవహారం వెలుగు చూసింది. ఎస్వీబీసీ చానల్ అన్ని రకాల దారుణాలు జరుగుతున్నాయని.. వరుసగా వెలుగు చూస్తున్న ఘటనతో వెల్లడవుతోందని భక్తులు ఆవేదన చెందుతున్నారు.