జూన్ నెలాఖరుకల్లా ఉద్యోగులు హైదరాబాద్ నుంచి తరలివచ్చేస్తారు కనుక ఆలోగానే వాళ్ళు పనిచేసుకోవడానికి సచివాలయం అవసరమని సుమారు 500 కోట్లు పోసి వెలగపూడిలో యుద్ధప్రాతిపదికన తాత్కాలిక సచివాలయం నిర్మిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కానీ హైదరాబాద్ లో పనిచేస్తున్న ఉద్యోగులు మళ్ళీ సమయం దగ్గర పడిన తరువాత, అనేక కారణాలు చెప్పి వచ్చే ఏడాది మార్చి వరకు తమకు సమయం ఇవ్వాలని కోరుతున్నారు. వారి షరతులు, సమస్యలు, కారణాలు అందరికీ తెలిసినవే. కనీసం వసతి సౌకర్యం కూడా లేకుండా విజయవాడ వచ్చి తాము ఎక్కడ ఉండాలని ఉద్యోగులు అడుగుతున్నారు. ఆ ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద కూడా సమాధానం లేదు. మంత్రులు, ఉన్నతాధికారుల కోసం ప్రభుత్వం విలాసవంతమయిన అపార్ట్మెంటులు అద్దెకు తీసుకొంటోంది. కానీ, నగరంలో అద్దెకు ఇళ్ళు వెతుక్కోవలసిన బాధ్యత ఉద్యోగులదేనని చెపుతోంది.
ఏదో ఒకరోజు ఉద్యోగులు అందరినీ విజయవాడకి తరలించాలని ప్రభుత్వానికి తెలిసి ఉన్నప్పటికీ, వారికి ఎక్కడ వసతి కల్పించాలనే విషయం ఆలోచించకుండా వందల కోట్లు ఖర్చు చేసి హడావుడిగా తాత్కాలిక సచివాలయం సిద్దం చేసేస్తోంది. కానీ ఒకవేళ ఉద్యోగులు రాలేకపోతే ఆ భవనంపై పెట్టిన ఖర్చు అంతా వృధాయే కదా? కనుక ఉద్యోగులకు సౌకర్యవంతమయిన వసతి చూపించవలసిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. అది సాధ్యం కాదనుకొంటే, ఉద్యోగులను వారు కోరుతున్నట్లుగానే వచ్చే మార్చి వరకు హైదరాబాద్ లోనే కొనసాగనిచ్చి, తాత్కాలిక సచివాలయ భవనాన్ని తాత్కాలిక రాష్ట్ర హైకోర్టు భవనంగా వినియోగించుకోవడానికి వీలవుతుందేమో ఆలోచిస్తే మంచిది. ఆ విధంగా చేస్తే రెండు సమస్యలు పరిష్కారం అవుతాయి. రాజధానిలో శాశ్విత సచివాలయం, ఉద్యోగులకు ఇళ్లు, విద్యాలయాలు వగైరా మౌలిక సదుపాయాలన్నీ సిద్దం చేసుకొని ఉద్యోగులను తరలిస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు. అప్పుడు ఉద్యోగులు కూడా అభ్యంతరాలు చెప్పలేరు. ఎలాగూ మరో 8ఏళ్ల పాటు హైదరాబాద్ ని వాడుకొనే వెసులుబాటు ఉంది కనుక ఈ విషయంలో తొందరపాటు అనవసరం. దాని వలన ఊహించని సమస్యలు, ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య ఘర్షణ ఏర్పడటం ఎవరికీ మంచిది కాదు.