ప్రభుత్వోద్యోగుల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు! వారి విషయంలో తాను మారాను మారాను అని పదేపదే చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఈ మాట చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు, తిరుపతిలో జరిగిన ఎన్జీవో మహాసభల్లో కూడా ఇవే సంకేతాలు మళ్లీ ఇచ్చారు. ఓపక్క ఉద్యోగుల పనితీరును మెచ్చుకుంటూనే, మరోపక్క వారి విషయంలో తన వ్యవహార శైలి ఎంతో మారిందనేది ప్రసంగంలో అంతర్లీనంగా చెప్పే ప్రయత్నం చేశారు. ‘ఒకప్పుడు నేనంటే మీరంతా భయపడేవారనీ, అప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో పని భారం పెంచాల్సి వచ్చింద’ని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు ఆ పరిస్థితి పోయిందనీ, ఒత్తిడి లేకుండా ఉద్యోగాలు చేసుకునే వాతావరణం ఉందనీ, ఇదే సమయంలో సిద్ధాంతపరంగా తాను ఎక్కడా రాజీపడలేదని అన్నారు. తన వ్యవహార శైలిలోనే కొంత మార్చుకున్నాను అని సీఎం చెప్పారు.
టీడీపీ ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో అద్భుతంగా అమలు జరుగుతున్నాయంటే దానికి ప్రభుత్వోద్యోగుల పనితీరే కారణం అంటూ మెచ్చుకున్నారు. దాని వల్ల ఓటు బ్యాంకు బ్రహ్మాండంగా పెరిగిందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఉద్యోగ సంఘాలు చేసిన పోరాటం తాను ఎప్పటికీ మరచిపోలేనని అన్నారు. ఆ తరువాత, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తన గెలుపునకు ఎంతో కృషి చేశారు అంటూ చంద్రబాబు కొనియాడారు. వేరొకరు అధికారంలోకి వస్తే సరిగా జీతాలు వస్తాయో రావో అనే ఆందోళనతో తనకు మద్దతు ఇచ్చారని చెప్పారు. విభజన తరువాత ఎన్నో ఇబ్బందులకు ఓర్చారనీ, ఎంతో సమర్థవంతంగా అన్ని శాఖల ఉద్యోగులూ పనిచేస్తున్నారని మెచ్చుకున్నారు.
ఉద్యోగుల పనితీరును మెచ్చుకుంటూనే, వారి విషయంలో తాను చాలా మారాను అని మరోసారి చెప్పే ప్రయత్నం చంద్రబాబు చేశారు. అంతేకాదు, గతాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేశారని కూడా చెప్పాలి! భవిష్యత్తు అంటే మరో ఏడాదిన్నరలో రానున్న ఎన్నికలే. తమకు జీతాలు సరిగా వస్తాయో రావో అనే భయంతోనే గతంలో తనకు మద్దతు నిలిచారని చెప్పడం దేనికి సంకేతం..? అంటే, రాబోయే ఎన్నికల్లో కూడా ఉద్యోగ సంఘాల మద్దతు చంద్రబాబుకే ఉండాలన్న ఆవశ్యకతను అంతర్లీనంగా చెబుతున్నట్టే కదా! తాను మారానని చెబుతూ తనను మరోసారి మార్చొద్దనే వేడుకోలు చంద్రబాబు ప్రసంగంలో స్పష్టంగానే కనిపిస్తోంది.