ఉద్యోగులు పెంచిన జీతాలు వద్దు బాబోయ్ అంటున్నారు . తాము అదనంగా రూ. పది వేల కోట్ల మేరకు ఉద్యోగులకు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఆ పదివేల కోట్లు మీరే ఉంచుకోండి.. మా పాత జీతాలు మాకిచ్చేయండి అని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇది వినేవారికి కాస్త విచిత్రంగా ఉంటుంది. ఉండవల్లి అరుణ్ కమార్ చెప్పినట్లుగా… నిజంగానే ఇలా పెంచిన జీతాలు మాకు వద్దు అని సమ్మెలోకి ఉద్యోగులు వెళ్లడం ఇదే మొదటి సారి కావొచ్చు. పెంచింది సరిపోలేదని ఇంకా పెంచాలని అడుగుతూ వెళ్తారేమో కానీ.. పెంచింది మీరే ఉంచుకోండి.. మా పాత జీతాలు మాకివ్వండని అడుగుతున్న వైనం మాత్రం… అందర్నీ కాస్త ఆశ్చర్య పరుస్తోంది.
అయితే ఏపీ ప్రభుత్వ పెద్దలు.. వారి లెక్కల బ్యాక్ గ్రౌండ్ గురించి కాస్త అవగాహన ఉన్న వారికి.. ” లెక్కల మాయ” ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందో ఇలాంటివే తెలియచేస్తున్నాయంటున్నారు. పెట్టుబడుల లెక్కలతో రాటుదేలిపోయి..అటూఇటూ చూపించి.. చివరికి ఏమీ లేకుండా చేసి.. చేయగలిగినంత గోల్ మాల్ చేయగలిగిన లెక్కలు వేయడం దిట్టలుచాలా మంది ఉన్నారు. ఆ ప్రకారం… లెక్కలు వేసి పీఆర్సీ రెడీచేశారు. అంతిమంగా జీతం పెరుగుతోందని చూపిస్తున్నారు.
కానీ తాము ఘోరంగా నష్టపోతామని.. ఆ నష్టం ఒకే సారి ఉండదని శాశ్వతంగా ఉంటుందని ఉద్యోగులు రగిలిపోతున్నారు. ఈ లెక్కలు ఉద్యోగులకు అర్థమయ్యాయి. ప్రజలకూ అర్థమయ్యాయి. కానీ కులం.. మతం .. పార్టీ అభిమానంతో కళ్లు మూసుకుపోయిన కొంత మందికి మాత్రం అర్థం అయినా అర్థం కానట్లు ఉంటాయి. సమర్థించే అలాంటి వారు ఉన్నంత కాలం.. అధికార పార్టీ పెద్దలు ధైర్యంగా ఇలాంటి లెక్కలే వేస్తూంటారు. వారంతా బిందాస్.