హర్యానా మాజీ సీఎం చౌతాలా ఉద్యోగ నియామకాల్లో అక్రమాలకు పాల్పడి జైలుకెళ్లారు. ఇప్పుడు ఏపీలోనూ అలాంటి అక్రమాలే బయటపడ్డాయి. ఏపీ నుంచి కూడా ఓ చౌతాలా ఉండటం ఖాయమన్న అభిప్రాయం అప్పుడే ప్రారంభమయింది. అసలు విషయం ఏమిటంటే టీడీపీ హయాంలో గ్రూప్ వన్ ఉద్యోగ నియామకాలు ప్రారంభించారు. పరీక్షలు పెట్టిన తర్వాత ఎన్నికలొచ్చాయి. ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన వెంటనే.. గ్రూప్ వన్ పరీక్షల్ని రద్దు చేయలేదు కానీ.. ఎంపిక ప్రాసెస్ మార్చేసింది. మాన్యువల్‌గా వద్దు డిజిటల్ మూల్యంకనం చేయాలని నిర్ణయించింది.
ఎవరు నిర్ణయించారంటే ఉన్నత స్థాయిలో ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ తాను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదన్నారు. తన వద్ద చర్చ కూడా జరగలేదని కోర్టుకు తెలిపారు. ఆ డిజిటల్ మూల్యంకనంలో 324 మంది ఇంటర్యూలకు ఎంపికయ్యారు. అందులో ఒకే సామాజికవర్గం వారు అత్యధిక మంది ఉన్నారు. తాము ఖచ్చితంగా అర్హత సాధిస్తామనుకున్న అనేక మంది ఫెయిలయ్యారు. దీంతో ఏదో తేడా కొట్టిందని చాలా మంది హైకోర్టుకు వెళ్లారు. నారా లోకేష్ కూడా వారి పోరాటానికి మద్దతు తెలిపారు.
కోర్టులో విచారణ జరుగుతూండగానే సివిల్స్ రిజల్ట్స్ వచ్చాయి. గ్రూప్ వన్‌లో అర్హత సాధించలేకపోయిన చాలా మంది సివిల్స్‌లో ర్యాంకులు సాధించారు. దీంతో గోల్ మాల్ జరిగిందనేదానికి ఇంత కంటే సాక్ష్యం ఏం కావాలని కోర్టులో వాదించారు. చివరికి కోర్టు నిజానిజాల్ని తేల్చాలని ఇంటర్యూలను రద్దు చేసి మాన్యూవల్ వాల్యూయేషన్‌కు ఆదేశించింది. చివరికి మాన్యూవల్ వాల్యూయేషన్‌లో ఇంటర్యూలకు ఎంపికైన 201 మంది అనర్హులని తేలింది.
అసలు అర్హత లేని వాళ్లను డిజిటల్ వాల్యూయేషన్ పేరుతో ఎలా ఇంటర్యూలకు ఎంపిక చేశారు..? అసలు డిజిటల్ వాల్యూయేషన్ నిర్ణయం ఎవరిది ? భారీ స్కాం చేయడానికి ఎవరు కుట్ర పన్నారు ? ఇవన్నీ బయటకు రావాల్సి ఉంది. అయితే ఈ ప్రభుత్వంలోనే జరిగిందికాబట్టి ఏదీ బయటకు రాదు. ప్రభుత్వం మారగానే.. ఆ చౌతాలా అడ్డంగా ఇరుక్కుపోవడం ఖాయమని ఏపీపీఎస్సీలో కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.