పాపం ఏపీ ఉద్యోగులు.. అని ఎవరైనా జాలిపడితే అందులో తప్పేం లేదు. ఎందుకంటే కోరి తెచ్చుకున్న ప్రభుత్వం. అధికారంలో ఉన్న పార్టీని బాకా ఊదేందుకు వాళ్లు చెప్పుకున్న మాట కాదు ఇది. గత ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లను చూస్తే వెల్లడయ్యే పచ్చి నిజం. 70 శాతం పోస్టల్ ఓట్లు వైసీపీకే పడ్డాయి. ఇక పోలింగ్ విధుల్లో .. ఏపీ ఎన్జీవో నేత బండి శ్రీనివాసరావు చెప్పినట్లుగా రెండు చేతులతో ఓట్లేసి గెలిపించారో లేదో కానీ.. తమకు హక్కుగా ఉన్న ఒక్క ఓటును మాత్రం వైసీపీకే వేశారు. అది మాత్రం నిజం.
గెలిచిన తర్వాత మా ప్రభుత్వం.. మా ప్రభుత్వం అని బొర్రలు విరుచుకుని మాట్లాడారు. ఆ ప్రభుత్వం చట్ట వ్యతిరేక.. రాజ్యాంగ వ్యతిరేక కార్యకలపాలాకూ పాల్పడినా సై అన్నారు. అమరావతి నుంచి విశాఖకు రాజధాని అంటే సరే అన్నారు. ఎస్ఈసీ మీద మాటల దాడిచేయడానికి.. తేడా వస్తే చంపేస్తామన్న ఘాటు వ్యాఖ్యలు చేయడానికీ వెనుకాడలేదు. అంతగా ప్రభుత్వాన్ని ఓన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్రభుత్వం వాటిని గుర్తించలేదు. సరి కదా వారిని ప్రజలతోనే ఛీకొట్టించాలని నిర్ణయించుకుంది.
తమను నమ్మిన వారికి మేలు చేయడం రాజకీయ నాయకుల లక్షణం. ఏపీలో విచిత్రంగా దానికి భిన్నంగా జరుగుతోంది. నమ్నిన ఉద్యోగుల్ని వర్గ శత్రువులుగా చూస్తున్నారు. జీతాలు తగ్గించేసి.. పెంచమని మాటలు చెబితే ఉద్యోగులు నమ్మేయరు. కానీ నమ్మకపోతే సంగతి చూస్తామన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉంది. ఏపీ ప్రభుత్వం ఇలా అందర్నీ దూరం చేసుకుంటోంది. భయంతో కంట్రోల్లో ఉంచాలనుకుంటోంది. ఇది ఎప్పటికైనా ప్రమాదకరమే. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించుకోవాల్సి ఉంది.