ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ సంఘాల నేతల “సామాజిక” భక్తి, విధేయత చంపుతాం అనే హెచ్చరికల వరకూ వెళ్తోంది. గత మూడు రోజులుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఉద్యోగ సంఘ నేతలు.. అదే పనిగా మీడియా ముందుకు వచ్చి అనేక రకాల ప్రకటనలు చేస్తున్నారు. అయితే.. ఏపీ సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామి రెడ్డి ఈ వ్యాఖ్యల విషయంలో మరింత ముందుకెళ్లారు. ప్రాణాపాయం ఉంటే చంపడానికైనా తమకు హక్కు ఉందని.. దాన్ని వినియోగించుకుంటామని ప్రకటించారు. రాజ్యాంగంలో ఆ విషయాన్ని పొందుపరిచారని చెప్పుకొచ్చారు. ఓ చానల్‌తో వెంకట్రామి రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వెంకట్రామిరెడ్డికి రాజ్యాంగం ప్రకారం చంపే హక్కు ఎలా వచ్చిందన్న సంగతితో పాటు.. అసలు ఆయన ఎవర్ని చంపుదామనుకుంటున్నారంటూ… చర్చ జరుగుతోంది. ఎన్నికల నిర్వహణలో పాల్గొంటే తమకు కోవిడ్ సోకుతుందని.. కోవిడ్ సోకితే చచ్చిపోతామని … ఇప్పుడు ఎన్నికలు పెట్టడం వల్ల.. నిమ్మగడ్డ తమకు ప్రాణాపాయం కల్పిస్తున్నారనేది ఆయన ఉద్దేశం. ఉద్యోగ సంఘాలన్నీ ఇదే చెబుతున్నాయి. దీని ప్రకారం.. వెంకట్రామిరెడ్డి… ఎస్ఈసీ రమేష్‌కుమార్‌నే చంపుతామని.. దానికి రాజ్యాంగం కూడా హక్కు కల్పించిందని ఆయన సమర్థించుకున్నట్లుగా భావించాల్సి ఉంటుందని ఇతర పార్టీల నేతలు అంటున్నారు.
అసలు చంపుతామనే మాట ఉద్యోగ సంఘాల నేతల వెంట రాడవమే చాలా మందిని ఆశ్చర్య పరుస్తూంటే… దానికి రాజ్యాంగంలో తమకు హక్కు కల్పించారంటూ.. వాదన వినిపించడం మరింత కలకలం రేపుతోంది. సచివాలయ ఉద్యోగ సంఘం నేతగా ఉన్న వెంకట్రామిరెడ్డి ఉద్యోగుల జీతాలను రెండు నెలల పాటు సగం జీతాలు ఇచ్చినా… ప్రభుత్వం కష్టాల్లో ఉందని.. జీతాలివ్వకపోయినా పర్వాలేదని … ప్రభుత్వంపై తమకు సామాజిక బాధ్యత ఉందని ప్రకటనలు చేశారు. ఉద్యోగ సంఘం నేతగా ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ… పలుకుబడి పెంచుకుంటున్నారు. అధికార పార్టీ రేంజ్ కు తగ్గట్లుగా చంపుడు ప్రకటనలు కూడా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.