సీపీఎస్ రద్దు కోసం ఉద్యోగులు చలో తాడేపల్లికి పిలుపునిచ్చారు. ఆ రోజు దగ్గర పడింది. అంతే.. తాడేపల్లి మొత్తం పోలీసు మయం అయిపోయింది. రోడ్లపై కంచెలు వచ్చి పడ్డాయి. ప్రతి ఒక్కర్ని నఖశిఖ పర్యంతం సోదా చేసికానీ వదిలి పెట్టలేదు. అది తాడేపల్లిలో పరిస్థితి. అక్కడ ఒక్క చోటే కాదు.. అక్కడి దాకా రాకుండా సిక్కోలు నుంచి చిత్తూరు వరకూ ఉద్యోగులందరిపై నిఘా పెట్టారు. పోలీసులను కాపలా పెట్టారు. పోలీసు వ్యవస్థ మొత్తాన్ని వారిపై నిఘా కోసమే ఉంచారు. చివరికి సీపీఎస్ రద్దు కోసం ఉద్యోగులు తాడేపల్లిని ముట్టడించకుండా చేయగలిగారని సంతృప్తి పడ్డారు.
నిజంగా సీపీఎస్ ఉద్యోగులు చలో తాడేపల్లి విషయంలో ఫెయిలయ్యారా ? ప్రభుత్వం ఇన్ని నిర్బంధాలు పెట్టేంతగా భయపడటమే వారు సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. కేవలం సీపీఎస్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులు మాత్రమే ఈ ఉద్యమం చేస్తున్నారు. పీఆర్సీ పేరుతో ఉద్యమించిన చాలా మందిని ప్రభుత్వం సైలెన్స్ చేసేసింది. అంటే 2004 తర్వాత ఉద్యోగంలో చేరిన వారికే సీపీఎస్ వర్తిస్తుంది. వారు మాత్రమే పోరాడుతున్నారు. వారిని కట్టడి చేయడానికి ప్రభుత్వం అన్ని మార్గాలనూ వాడుకుంది.
ప్రభుత్వం తమ పిలుపును ఇంత సీరియస్గా తీసుకుని ఇంత భయపడిందంటేనే.. తాము ఎంత విజయం సాధించామో అర్ధం చేసుకోవచ్చని సీపీఎస్ ఉద్యోగ సంఘాలుంటాయి. ఎప్పుడూ ఈ స్థాయిలో రక్షణ పెట్టుకోలేరని తమ సత్తా చూపిస్తామని అంటున్నాయి. సీపీఎస్ ఉద్యోగులు ప్రభుత్వం పదే పదే మోసం చేసిందన్న భావనలో ఉన్నారు. దీంతో వారిలో లావా ఎప్పుడైనా బయటపడవచ్చని ప్రభుత్వ వర్గాలు కూడా ఆందోళన చెందుతున్నాయి.