ఏపీ సర్కార్.. నిరుద్యోగ యువతకు… మరో బంపర్ ఆఫర్ ఇస్తోంది. ఇప్పటి వరకూ.. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల పేరుతో.. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించేసిన.. ఏపీ సర్కార్.. ఇప్పుడు మరో.. పదివేలకుపైగా… ఉద్యోగాలను కల్పించడానికి రంగం సిద్ధం చేసుకుంది. అవి ఆషామాషీ ఉద్యోగాలు కాదు… మద్యం షాపుల్లో ఉంటాయి. మద్యాన్ని అమ్మాలి. అయితే.. ఇక్కడ డోర్ డెలివరీ సర్వీస్ లేదు. దుకాణంలో కూర్చునే అమ్మాలి. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి.. ఏపీలో కొత్త మద్యం పాలసీ వస్తోంది. దీని ప్రకారం… లైసెన్సులు కంటిన్యూ చేయరు. ప్రభుత్వమే దుకాణాలు నిర్వహిస్తుంది. ఇందు కోసం ఉద్యోగుల్ని నియమించుకోబోతున్నారు.
ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ కు రిటైల్ దుకాణాల నిర్వహణకు అనుమతిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 3,500 దుకాణాలను నిర్వహిస్తుంది. ప్రతి మద్యం దుకాణంలోనూ సూపర్వైజర్, సేల్స్‌మెన్, వాచ్ అండ్ వార్డు అనే మూడు విభాగాల సిబ్బంది ఉంటారు. వీరిని గ్రామ వాలంటీర్లు ఎంపిక చేసుకున్నట్లే ఎంపిక చేస్తారు. సూపర్వైజర్కు రూ.17,500, సేల్స్‌మెన్‌కు రూ.15,000 వేతనం చెల్లిస్తారు. సూపర్వైజర్ పోస్టులకు డిగ్రీ, సేల్స్మెన్లకు ఇంటర్ విద్యార్హత. ఉద్యోగాలు కేవలం ఏడాది కాలవ్యవధి వరకే. సంతృప్తికరంగా పనిచేస్తే.. రెండో ఏడాది వీరిని కొనసాగించి ఓ నెల వేతనాన్ని బోనస్‌గా ఇస్తారట.
వీరి డ్యూటీలు మాత్రం.. ఎనిమిది గంటలు కాదు. పదకొండు గంటలు పని చేయాలి. ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ డ్యూడీ చేయాలి. ఉండే ముగ్గురిలో.నే… ఒకరికి ఒకరు మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో.. వారాంతపు సెలవు అడ్జస్ట్ చేసుకోవాలి. మద్యం కొన్నవారికి తప్పని సరిగా.. బిల్లులు ఇవ్వాల్సిందే. అంతకు మించి సూపర్ వైజర్లుగా.. పని చేసి.. ఓ ఇరవై వేల లోపు జీతం సంపాదించడానికి.. రూ. నాలుగైదు లక్షల వరకూ… బ్యాంక్ గ్యారెంటీ సమర్పించాల్సి ఉంటుంది. అంత మొత్తమే ఉంటే… వాటిని వడ్డీకి ఇచ్చినా… ఏ పనీ చేయకుండా.. ఆ జీతం వచ్చేస్తుంది కదా.. అని నిరుద్యోగులు అనుకోకూడదు. కొసమెరుపేమిటంటే.. ఈ ఉద్యోగాల్లో చేరాలనుకునేవారు.. పర్మినెంట్ చేయమని అసలు డిమాండ్ చేయకూడదు. అలా చేయకూడదని… ఒప్పందం పత్రంలోనే ఉంటుందట..!