నిన్నామొన్నటి వరకూ ప్రభుత్వ నిర్బంధాలపై భయంతోనో.. ప్రభుత్వ పెద్దలతో ఉన్న సఖ్యత కారణంగా మోహమాటంగానో మాట్లాడిన ఉద్యోగసంఘాల నేతలు ఈ రోజు ప్రతి ఒక్క ఉద్యోగి మద్దతుగా ఉన్నాడని క్లారిటీ రావడంతో స్వరం పెంచారు. పీఆర్సీ జీవోలను ఉపసంహరించుకునే వరకూ ఉద్యమాన్ని ఉద్దృతం చేస్తామని స్పష్టం చేశారు. ఏడో తేదీ నుంచి సమ్మె చేస్తామని ముందుగానే ప్రకటించారు.. అంతకు రెండు రోజుల ముందు నుంచి అంటే ఐదో తేదీ నుంచి సహాయనిరాకరణ చేయాలని నిర్ణయించారు. అంటే ఉద్యోగులు విధులకు హాజరవుతారు కానీ పనులు చేయరు.
రేపు ఒక్క రోజు మాత్రమే ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు నడుస్తాయి. ఎల్లుండి నుంచి ఇక అన్ని కార్యకలాపాలను బంద్ చేస్తారు. చర్చలు తప్ప మరే దిక్కు లేదంటున్న ప్రభుత్వానికి తాము సమ్మె చేస్తే ఎలా ఊపిరి ఆడుతుందో చూపిస్తామని అంటున్నారు. ఉద్యోగ సంఘాల నేతలకు ఆర్టీసీ, వైద్య, ఆరోగ్య శాఖ కూడా కలిసి వస్తూండటం ప్రభుత్వానికి ఉక్కపోత కలిగించేదే. బస్సులు ఆగిపోతే.. ఆస్పత్రుల్లో సేవలు ఆగిపోతే ప్రజలు ఇబ్బంది పడతారు. ప్రజలు ఉద్యోగుల మీద కన్నా ప్రభుత్వం మీదనే ఎక్కువ ఆగ్రహం వ్యక్తం చేస్తారు . ఆ విషయం పాలక పార్టీకి తెలియనిదేం కాదు.
అందుకే సమ్మె దాకా వెళ్లకుండా ఏం చేయాలన్నదానిపై సజ్జలతో జగన్మోహన్ రెడ్డి సమాలోచనలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో సీఎస్ సమీర్ శర్మ కూడా తన సూచనలు ఇస్తున్నారు. ప్రభుత్వం జీవోలను వెనక్కి తీసుకోవాలా లేకపోతే.. ఇదే కఠిన వైఖరి అవలంభించాలా అన్నదానిపై చర్చ ప్రారంభమైంది. ఇది ప్రభుత్వానికి ఎటూ తేలని సమస్య అయ్యే అవకాశం కనిపిస్తోంది.