సచివాలయ ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి కొత్త రాజధాని విశాఖకు వెళ్లడానికి ఉద్యోగులకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ… హైకోర్టుకు చెప్పేందుకు తాపత్రయ పడుతున్నారు. రైతులు వేసిన పిటిషన్లకు కౌంటర్‌గా తాను కూడా.. ఉద్యోగ సంఘం నేత హోదాలో అనుబంధ కౌంటర్ పిటిషన్ వేసేసి.. కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఆయన పిటిషన్ ఉద్దేశం. అమరావతికి వెళ్లడానికి ఉద్యోగుల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పడం. ఆయన వెనుక ప్రభుత్వ పెద్దలున్నారని..ఉద్యోగులు అందరికీ నమ్మకం. ప్రభుత్వ పెద్దల కోసం… అందరి ప్రయోజనాలను ఆయన కాలరాస్తున్నారన్న ఆగ్రహం ఉద్యోగుల్లో కనిపిస్తోంది.
ఈ వెంకట్రామిరెడ్డి… హైదరాబాద్ నుంచి అమరావతికి సెక్రటేరియట్ తరలించినప్పుడు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా… ఆయన ఉద్యోగుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. పదేళ్ల పాటు హైదరాబాద్‌లోనే ఉండాలని.. ఇంకా… ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందని.. వాదించేవారు. తీరా.. ఇప్పుడు.. హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చిన ఉద్యోగులు కుదురుకోకుండానే.. విశాఖకు తీసుకెళ్తున్నారు. ఈ నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించకపోగా.. అవసరం లేకపోయినా… కోర్టులకు ఉద్యోగ సంఘాన్ని ఎక్కిస్తున్నారు.
మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నప్పుడు.. ఉద్యోగులు తీవ్ర వ్యతిరేకత తెలిపారు. ఆ సమయంలో.. కొన్ని సమావేశాలు .. నిర్వహించారు. వెంకట్రామిరెడ్డికి.. తమ వాదన వినిపించారు. అయితే.. అలా వ్యతిరేకత వ్యక్తం చేసిన కొంత మంది ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు ప్రారంభమయ్యాయి. ఇద్దరు ముగ్గుర్ని సస్పెండ్ చేశారు. దీంతో.. ఉద్యోగులెవరూ నోరు మెదపలేని పరిస్థితి ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకుని… వెంకట్రామిరెడ్డి.. వైసీపీకి అనుకూలమైన రాజకీయం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమం వచ్చినప్పటి నుండి ఉద్యోగ సంఘాల నేతలు.. రాజకీయ భవిష్యత్ వెదుక్కుంటున్నారు. స్వామిగౌడ్, శ్రీనివాసగౌడ్, అశోక్ బాబు , గోపాల్ రెడ్డి లాంటి వాళ్లంతా.. వివిధ పార్టీల్లో పెద్ద పదవులు పొందారు. ఇప్పుడు వెంకట్రామిరెడ్డి కూడా అదే బాటలో ఉన్నారని ఉద్యోగులు మండి పడుతున్నారు.