చేయూత, ఆసరా పథకాల ద్వారా పెద్ద ఎత్తున మహిళలకు ఆర్థిక సాయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి సర్కార్.. ఆ ధనంతో వారు వ్యాపారంలో రాణించేలా ప్లాన్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే వివిధ ప్రఖ్యాత సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. ఆసరా, చేయూత నిధులతో మహిళలకు గేదెలు, ఆవులు కొనుగోలు చేసి పాల విప్లవం సృష్టించేలా చేయాలని జగన్ నిర్ణయించారు. అలాగే నిత్యావసరదుకాణాలను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే ఈ దిశగా కసరత్తు కూడా ప్రారంభమయింది. అమూల్‌తో పాటు వివిధ మల్టీనేషనల్ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కూడా చేసుకుంది.
చేయూత పథకంలో 21 లక్షల లబ్ధిదారులు ఉన్నారు. వారికి రూ.3937 కోట్లు పంపిణీ చేశారు. ఆసరా పథకంలో 87.74 లక్షల లబ్ధిదారులు ఉన్నారు. వీరికి రూ.6792 కోట్లు పంపిణీ చేశారు. రెండు పథకాల్లో ప్రయోజనం పొందిన మహిళలు 13 లక్షల మంది ఉన్నారు. వీరితో మూడున్నర లక్షల గేదెలు, రెండు లక్షల ఆవులు కొనుగోలు చేయించాలని నిర్ణయించారు. నిపుణుల అభిప్రాయం తీసుకుని .. లబ్దిదారులైన మహిళలకు చెప్పాలని.. వారు ఏది కొనాలని నిర్ణయించుకుంటే అదే కొనుక్కోనివ్వాలన్నారు. కిరణాదుకాణాలకు కూడా.. అదే పద్దతి పాటించాలన్నారు. ఆసరా, చేయూత ద్వారా ఏర్పటయ్యే ఉపాధి యూనిట్లకు ఓ బ్రాండింగ్ తీసుకు రావాలని జగన్ లక్ష్యాన్ని నిర్దేశించారు.
ఆవు లేదా గేదె కొన్న వారికి ఆర్బీకేల ద్వారా పశుగ్రాసం కూడా పంపిణీ చేస్తారు. పశువుల సేకరణ, వాటికి దాణా, అవసరమైన మందుల పంపిణీ ప్రక్రియలో అమూల్ సంస్థ సహకారం అందిస్తుంది. మేకలు, గొర్రెలు పెంచుకోవాలనుకునేవారికి కూడా.. సహకారం అందిస్తారు. ప్రస్తుత పథకాల ద్వారా కొంటున్న ఆవులు, గేదెల కారణంగా రోజూ 75 లక్షల లీటర్లు అదనంగా పాల ఉత్పత్తి జరగాలని నిర్దేశించారు. ముఖ్యమంత్రి సంక్షేమం పేరుతో డబ్బులు పంచడమే కాకుండా.. వాటిని ప్రజలు ఉపాధి కోసం వినియోగించుకునేలా వ్యూహం సిద్ధం చేస్తున్నారు. ఆ ప్రకారం అడుగులు ముందుకు వేస్తున్నారు. ఆయన ఆలోచనలు సక్సెస్ అయితే గ్రామీణ పేదరిక సమసిపోతుంది.