తెలంగాణ సీఎం కేసీఆర్ యాభై వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే గతంలో ఇలాంటి ప్రకటనలు ఎన్నో ఆయన చేసి ఉండటంతో యువత పెద్దగా నమ్మడం లేదు. ఇలాంటి పరిస్థితిని కేసీఆర్ స్వయంగా తెచ్చుకున్నారు. ఎందుకంటే.. గతంలో ఎన్నో ఉద్యోగ ప్రకటనలు ఇచ్చినా వివిధ సమస్యలతో న్యాయస్థానాల్లో పిటిషన్లు పడేలా లోపాలతో నోటిఫికేషన్ ఇచ్చారని యువత భావిస్తున్నారు. అలా కోర్టుల్లో పడిన తర్వాత ప్రభుత్వం సైలెంటయిపోయింది. ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే… ఉద్యోగ నోటిఫికేషన్లు అని..అవి అయిపోయిన తర్వాత సైలెంటవుతారని అనుమానిస్తున్నారు.
తెలంగాణలో ఉద్యోగాల భర్తీ చేయాలంటే.. ప్రభుత్వం పరిష్కరించాల్సిన సవాళ్లు చాలా ఉన్నాయి. ప్రధానంగా జోనల్ విధానం సమస్యగా మారింది. 31 జిల్లాల స్థానికతతో కూడిన జోనల్ విధానం అమల్లోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా.. ఇప్పటివరకూ పోస్టులను పునర్విభజించలేదు. కొత్త జోనల్ విధానం ప్రకారం.. మల్టీజోన్లు, జోన్లు, జిల్లాల వారీగా పోస్టులేవో టీఎ్సపీఎస్సీకి ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. అందుకే ఇప్పటికే 3 వేలకుపైగా పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపినా.. టీఎ్సపీఎస్సీ నోటిఫికేషన్లను విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది.
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల కాలేదు. 2018లో ఓ సారి నోటిఫికేషన్ ఇచ్చే సమయంలో జిల్లాలు విభజించి.. కొత్త జోనల్ విధానాన్ని తెచ్చారు. అయితే ఏ పోస్టు.. ఏ జోన్ కిందకు వస్తుందో ప్రభుత్వం చెప్పలేదు. అలా వాయిదా పడుతూ వస్తున్నాయి. ముందు ఈ సమస్యను పరిష్కరిచాల్సి ఉంది. అయితే ఇది అంత తేలిగ్గా పరిష్కారమయ్యేది కాదని నిరుద్యోగులు నిరాశ పడుతున్నారు. మొత్తం జోనల్ నోటిఫై చేసిన తర్వాత రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి.. రాష్ట్రపతికి పంపారు. కానీ ఆమోదముద్రపడలేదు. అది కూడా వివాదంగా మారింది.
ఈ సమస్యలన్నింటినీ అధిగమించి.. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేయకపోతే.. నిరుద్యోగుల్లో ఉన్న ఆగ్రహం మరింత పెరిగే ప్రమాదం ఉంది. అది ఎమ్మెల్సీ ఎన్నికలతోనే ఆగిపోదు. ముందు ముందు.. చాలా పెద్ద సమస్యలు సృష్టిస్తుంది. ఈ విషయం టీఆర్ఎస్ పెద్దలకు తెలియనిదేం కాదు. కానీ ఎప్పటికప్పుడు తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ప్రకటనలు చేస్తూ పోవడంతోనే సమస్య వస్తోందన్న అభిప్రాయం.. టీఆర్ఎస్ నేతల్లో ఉంది.