ఉద్యోగ పరీక్షల నిర్వహణలో… ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు మరీ అంత చెడ్డ పేరేమీ లేదు. గత ఐదేళ్లలో అయితే.. అసలు ఒక్క ఆరోపణ కూడా లేదు. గ్రూప్స్ ఉద్యోగాలు పలుమార్లు భర్తీ చేశారు కానీ… ఆరోపణలు రాలేదు. కానీ ఇప్పుడు గ్రామ సచివాలయ ఉద్యోగాల విషయంలో మాత్రం అనేక ఆరోపణలు వస్తున్నాయి. అందరూ ఏపీపీఎస్సీని గురి పెడుతున్నారు. కానీ.. ఈ పరీక్షలకు.. ఏపీపీఎస్సీకి సంబంధమే లేదు. కేవలం.. క్లరికల్ వర్క్‌లో సాయం మాత్రమే చేసింది. కానీ పరీక్షల నిర్వహణ ఏపీపీఎస్సీ చేసిందన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
అసలు సచివాలయ ఉద్యోగుల పరీక్షలు చట్టబద్ధమేనా అన్న చర్చ ప్రారంభమయింది. పంచాయతీరాజ్ శాఖతో పాటు.. వివిధ శాఖలు.. విడివిడిగా నోటిఫికేషన్లు ఇచ్చి.. ఉద్యోగ నియామకాలు చేపట్టాయి. అలా.. ఏ శాఖకు ఆ శాఖ ఉద్యోగుల్ని నియమించుకునే సంప్రదాయం లేదు. శాశ్వత ఉద్యోగుల్ని ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. కానీ శాశ్వత ఉద్యోగాలని చెబుతూనే… గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీని మాత్రం ఏపీపీఎస్సీకి ఇవ్వలేదు. ఏపీపీఎస్సీ ద్వారా ఎందుకు భర్తీ చేయలేదనేది ఇప్పుడు పజిల్‌గా మారింది. అయితే.. పరీక్ష నిర్వహణకు మాత్రమే ఏపీపీఎస్సీని ఉపయోగించుకున్నారు. దీని ద్వారా ఏపీపీఎస్సీ ద్వారా నియామకాలన్న భ్రమలు కల్పించే ప్రయత్నం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఏపీపీఎస్సీ ద్వారా నియమించడానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమిటనేది.. పేపర్ లీకేజీ వ్యవహారం తర్వాత… అందరికీ వస్తున్న అనుమానం. శరవేగంగా అన్ని ఉద్యోగాలను.. నియమించడానికి ఏపీపీఎస్సీ కన్నా.. ఎక్కున నెట్ వర్క్ ఏ సంస్థకు ఉంటుంది. ఇప్పుడు.. జరిగిన అవకతవకలకు ఎవరు బాధ్యత వహిస్తారు..? అనే చర్చ ప్రారంభమైంది. అంతే కాకుండా.. ఇప్పుడు ఉద్యోగాలు పొందిన వారికి ఏ విధంగా ఉద్యోగ భద్రత ఉంటుందనే చర్చ కూడా నడుస్తోంది. ఏపీపీఎస్సీ ద్వారా నియామకం పొందని వారికి గ్యారంటీ ఉండదని నిపుణులు చెబుతున్నారు. రెండేళ్ల తర్వాత వారిని శాశ్వత ఉద్యోగులగా గుర్తించడం సాధ్యపడదని చెప్పరని గ్యారంటీ ఏమిటంటున్నారు. ఇన్ని అవకతవకలు జరిగిన తర్వాత రేపు ప్రభుత్వం మారితే..వీరి ఉద్యోగాలు ఉంటాయా.. అన్నది మరో సందేహం. మొత్తానికి ప్రభుత్వం అనాలోచిత చర్యలతో… 20 లక్షల మందిని మానసిక వ్యధకు గురి చేస్తోందేనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.