దిశ నిందితులను ఎన్కౌంటర్ చేసి క్రేజీ పోలీసుగా పేరు తెచ్చుకున్న తెలంగాణ సీనియర్ ఐపీఎస్ వీసీ సజ్జనార్‌కు చిక్కులు ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్ బూటకమని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు నాలుగేళ్ల కిందటే మాజీ న్యాయమూర్తి సిర్ఫూర్కర్ నేతృత్వంలో విచారణ కమిటీని నియమించింది. ఈ కమిటీ విచారణ వివిధ కారణాలతో ఆలస్యమవుతూ వస్తోంది. కానీ ఇప్పుడు తప్పనిసరిగా సమర్పించాల్సి రావడంతో వారు తెలంగాణకు వచ్చి విచారణ జరుపుతున్నారు.
జస్టిస్ సిర్ఫూర్కర్ నేతృత్వంలోని త్రిసభ్య కమిషన్ హైదరాబాద్‌లోనే ఉండి అన్ని వివరాలు సేకరిస్తోంది. దిశ కేసును కేసును దర్యాప్తు చేసిన సిట్ ఇన్‌ఛార్జి సురేందర్‌రెడ్డిని ప్రశ్నించింది. హోంశాఖ కార్యదర్శి నుంచి అదనపు వివరాలు తీసుకుంది. ఆ తర్వాత ఎన్కౌంటర్లో చనిపోయిన నిందితుల కుటుంబసభ్యులను కూడా పిలిచించి వాంగ్మూలాలు తీసుకున్నారు. అంతిమంగా అసలు దిశ కేసులో నిందితులు వాళ్లే అనడానికి ఎలాంటి ఆధారాలున్నాయో కూడా సమాచారం సేకరించినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా సిట్ ఇచ్చిన సమాచారం ఏ మాత్రం పొంతన లేకుండా ఉండటంతో జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ పరిగణనలోకి తీసుకోవడానికి అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
ఓ వైపు కమిషన్ ఇలా విచారణ జరుపుతూండగానే వీసీ సజ్జనార్‌ను హుటాహుటిన ప్రభుత్వం బదిలీ చేసింది. ఉదయం నిర్ణయం తీసుకుని మధ్యాహ్నం కల్లా ఆయనను రిలీవ ్చేసేసింది. ఇంత హఠాత్తుగా సజ్జనార్‌ను బదిలీ చేయాల్సిన అవసరం ఏమిటో చాలా మందికి అర్థం కాని పజిల్‌గా మారిపోయింది. కానీ ఎన్ కౌంటర్‌పై జస్టిస్ సిర్ఫూర్కర్ కమిషన్ విచారణే కారణమని చెబుతున్నారు. ఆ ఎన్ కౌంటర్ బూటకం అని కమిషన్ సుప్రీంకోర్టుకు నివేదిక ఇస్తే సజ్జనార్ .. తీవ్రమైన ఇబ్బందులు పడక తప్పదని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి.