నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నెట్ జెన్ల (ఇంటర్నెట్ వాడకందార్ల) ప్రయోజనాలను తీవ్రస్థాయిలో గండికొట్టే నెట్ పోలీసింగ్ (వినియోగదారులపై నిఘా) విధానాన్ని ప్రవేశపెట్టాలని నిజంగా అనుకోలేదా? కేవలం ఒక జూనియర్ అధికారి (సైంటిస్ట్) జాతీయ ఎన్క్రిప్షన్ పాలసీ ముసాయిదా ప్రతిలో సరైన పదాలు ఉపయోగించకపోవడం వల్లనే కేంద్రపై మచ్చపడిందా? ఈ ప్రశ్నలకు కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ `అవు’ననే సమాధానమిస్తున్నారు. ముసాయిదా ప్రతిని తయారుచేయడంలో నిజంగానే తప్పుజరిగినప్పటికీ చాలా దిగువస్థాయి అధికారిపైనే పూర్తి నిందమోపడం పాలకుల్లోని నాయకత్వ లక్షణాలనే శంకించాల్సిన పరిస్థితి తలెత్తింది.
ఇంటర్నెట్ సాధనాలైన వాట్సప్ , ఫేస్ బుక్ వంటి సమాచారవ్యవస్థలను ఉపయోగించే యూజర్స్ పై కేంద్రం జాతీయ ఎన్క్రిప్షన్ విధానం అమలుచేస్తుందనీ, దీంతో సదరు యూజర్స్ తమ ఎన్క్రిప్షన్ సమాచారాన్ని కనీసం 90రోజుల పాటు డిలెట్ కాకుండా చూసుకోవాలనీ, పోలీసులు లేదా ప్రభుత్వ అధికారులు తమ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఒక వేళ అడిగే పక్షంలో ఈ సమాచారాన్ని వారికి అందించాలనీ, అలా చేయలేకపోతే జైలుశిక్ష సహా కఠిన శిక్షలు ఎదుర్కోవలసిఉంటుందన్నది ఈ ముసాయిదా ప్రతిలోని సారాంశం. ఈ డ్రాఫ్ట్ ను ప్రజాభిప్రాయం కోసం పబ్లిక్ డొమైన్ లో ఉంచారు. సమాచారహక్కుపై ఉక్కు సంకెళ్లు బిగించినట్లున్న భావించి ఈ పాలసీకి చట్టబద్ధత రాకూడదంటూ ప్రజలనుంచి నిరసన పెల్లుబికింది. తమ వద్ద ఉండే రహస్య సంకేతాలను, సమాచారాన్ని ఇవ్వకబోతే జైలుపాలవ్వాల్సి వస్తుందేమోనన్న భయం అందర్నీ వెంటాడింది. పబ్లిక్ డొమైన్ లో ఈ పాలసీ ముసాయిదా ప్రతిని ఉంచిన 12 గంటల్లోనే కేంద్రం వెనక్కి తగ్గాల్సివచ్చింది. అనవసరమైన గొడవకు దారితీసేలా ఉందని భావించి ఎన్క్రిప్షన్ పాలసీని వెనక్కి తీసుకుంది.
ఈ నేపథ్యంలో కేంద్రం ఇప్పుడు తప్పును తమమీద ఉంచుకోకుండా ఒక చిరుద్యోగిని బలిచేయడానికి సిద్ధమైంది. ముసాయిదా ప్రతిలోని పదాల వాడకంలో తప్పులు దొర్లాయనీ, `యూజర్స్’ అన్న పదం వాడకంతో సోషల్ మీడియా వాడేవాళ్లంతా కంగారుపడిపోయారనీ, కేంద్ర విధానాన్ని తప్పుబడుతూ అపార్థం చేసుకున్నారనీ అంతేకానీ బహిరంగమైన పాలసీ ప్రతిలోని అంశాలు నిజంకాదంటూ తాజాగా టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ డప్పువాయిస్తున్నారు. ప్రజలంతా ఒకవేళ `భేష్’ అనిఉంటే ఆ ఘనత అంతా తమదేనని చెప్పుకునే నేతలు, ప్రజావ్యతిరేకత, నిరసన వ్యక్తమయినప్పుడు తప్పును క్రిందిస్థాయివారిపై తోసేయడం ఎంత సహజసిద్ధమన్నట్టు జరిగిపోతుందో ఈ సంఘటన మరోసారి చాటిచెప్పింది.
మోదీ ఇరుకునపడేవారే…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక పక్క యుఎస్ ట్రిప్ కి రెడీ అవుతున్నవేళ తప్పుడు సంకేతం వచ్చేలా జాతీయ ఎన్క్రిప్షన్ పాలసీ ముసాయిదా ప్రతిని పబ్లిక్ డొమైన్ లో ఉంచడం మోదీని సైతం ఇబ్బంది పెడుతుంది. మోదీ ఈ ట్రిప్ లోనే మిగతా ప్రముఖులతోపాటు ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకెర్ బర్గ్ ని కూడా కలవబోతున్నారు. సరిగా అదేసమయంలో యూజర్స్ ని టార్గెట్ చేస్తూ బహిర్గతమైన ఎన్క్రిప్షన్ పాలసీపై నెగెటీవ్ చర్చ జరుగుతుంటే అది మోదీకి ఇబ్బందిగా పరిగణించవచ్చు. ఈ భయంతోనే టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెంటనే కళ్లుతెరిచి ఈ పాలసీని ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు. కేవలం ఉపసంహరించుకున్నామని చెప్పినంతమాత్రాన బీజేపీ ప్రభుత్వంపై పడిన మచ్చ తొలిగిపోదు. నెట్ న్యూట్రాలిటీ (అంతర్జాల సమానత్వం) వ్యవహారంలోనే నెట్ జన్ల ఆగ్రహం చవిచూసిన కేంద్రం ఇప్పుడు మరోసారి అంతేస్థాయిలో నిరసన ఎదుర్కోవడం రాజకీయంగా ఏమాత్రం మంచిదికాదన్న సంగతి బిజేపీ పసిగట్టేసింది. ప్రధానమంత్రి మోదీ ఒక పక్క `డిజిటల్ ఇండియా’ అంటూ కబుర్లు చెబుతుంటే, మరో పక్క నెట్ జెన్లకు తీరని అన్యాయం జరిగేలా విధివిధానాల రూపకల్పన చేయాలనుకోవడం అటుతిరిగీ ఇటుతిరిగీ చివరకు మోదీ చిత్తశుద్ధినే శంకించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవన్నీ ఆలోచించే మొగ్గ దశలోనే సమస్యను త్రుంచివేయడంకోసం కేంద్రం నడుంబిగించింది.
ఇంతవరకూ బాగానే ఉంది. కానీ, తప్పు జరిగినప్పుడు ఆ తప్పేదో తామే చేశామని సవినయంగా అంగీకరించిఉంటే మోదీ పాలనలోని పారదర్శకతనూ, నాయకుల్లోని నిజాయితీని ప్రజలు మెచ్చుకునేవారు. కానీ అలాకాకుండా డ్రాఫ్ట్ తయారీలో జరిగిన తప్పును తమపై ఉంచుకోకుండా అమాయకపు చిరుద్యోగిపై తోసేయడం ఆక్షేపణీయం.
ఇంతకీ డ్రాఫ్ట్ లో యూజర్స్ అన్న పదానికి బదులు మరే పదం ఉండాలనుకున్నారు? ఈ ప్రశ్నకు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమాధానమిస్తూ, యూజర్స్ అన్న పదం వాడటంవల్లనే సమస్య తలెత్తిందనీ, అసలు `యూజర్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్’ అన్న పదాలకు బదులు `క్రియేటర్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్’ అని ఉండాలని చెబుతున్నారు. సాంకేతికంగా సమాచార వ్యవస్థను పొందుపరిచే వ్యాపారసంస్థలు, కంపెనీలు, ఐటీ యాప్స్ తయారీదారులు – క్రియేటర్స్ క్రిందకు వస్తారు. అయితే క్రియేటర్స్ అన్న పదానికి బదులు సమాచార, సాంకేతిక శాఖ నిపుణుల కమిటీలో పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు తప్పుడు సంకేతం వచ్చేలా యూజర్స్ అన్న పదం డ్రాఫ్ట్ లో ఉపయోగించారని మంత్రి వివరణ ఇచ్చారు. దీంతో గందరగోళ పరిస్థితి తలెత్తిందన్నది ఆయనగారి వాదన. సైబర్ నేరాలను కట్టడిచేయడంకోసం కేంద్రం జాతీయ ఎన్క్రిప్షన్ విధానాన్ని తీసుకురావాలనుకుంది. అయితే డ్రాప్ట్ దశలోనే ఈ పాలసీకి గడ్డుకాలం వచ్చేసింది.
ఇంత కీలకమైన డ్రాప్ట్ ని బహిర్గతం చేసేముందు సదరు డిపార్ట్ మెంట్ హెడ్ చూడకుండానే క్రిందిస్థాయి ఉద్యోగికి వదిలేయడమేమిటీ ?? సహజంగా ఏ ఆఫీస్ లోనైనా చిరుఉద్యోగి ఇలాంటి సాహసం చేయడు. అలాంటిది జూనియర్ ఆఫీసర్ ఒకరు నేరుగా పబ్లిక్ డొమైన్లో ఈ పాలసీ ప్రతిని పోస్ట్ చేయడం విడ్డూరమే. అసలు క్రిందిస్థాయి ఉద్యోగి అంత చొరవ తీసుకోవడం వెనుక ఏదైనా హస్తం ఉన్నదా? అన్న డౌట్స్ కూడా వ్యక్తం అవుతున్నాయి. పైగా, ఈ పాలసీ ప్రతిని ఇంత అర్జెంట్ గా ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం పబ్లిక్ డొమైన్ లో ఉంచాల్సిన అవసరంలేదు. అందునా మోదీ అమెరికా పర్యటనలో కీలకమైన వ్యక్తులను కలుసుకోబోతున్నసమయంలో ఇలాంటి వివాదాస్పద పాలసీని పబ్లిక్ డొమైన్ ద్వారా బహిరంగ పరచడంలో జూనియర్ ఆఫీసర్ ఎందుకని తొందరపడ్డాడన్నది కూడా నిశితంగా ఆలోచించాల్సిందే. తప్పు నిజంగా ఎవరిదన్నది విచారణలోకానీ తేలదు.
మొత్తానికి తప్పుడు డ్రాప్ట్ వ్యవహారం అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు రాజకీయ పరంగా జరిగిన నష్టాన్ని పూడ్చుకునే పనిలో బీజేపీ ప్రభుత్వం పడింది. మరోసారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటే నెట్ జెన్ల దృష్టిలో మిగిలిఉన్న కాస్తంత పరువును అధికార పార్టీ కాపాడుకోగలుగుతుంది. లేకుంటే సోషల్ మీడియా విప్లవంలో కొట్టుకుపోకతప్పదు.
– కణ్వస