కర్ణాటకలో రెబెల్ ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానాల్లో.. ముంబై టు బెంగళూరు తిరుగుతూ.. తమ రాజీనామాలకే కట్టుబడి ఉన్నారు. దీంతో.. ఇవాళ కాకపోయినా.. రేపైనా స్పీకర్ వారి రాజీనామాలను ఆమోదించక తప్పదు. ఆ తర్వాత కుమారస్వామి సర్కార్ నిలబడటం అసాధ్యం. దాంతో.. ఇప్పుడు.. ప్రత్యామ్నాయం ఏమిటన్న అంశం.. విపరీతంగా చర్చకు వస్తోంది. కుమారస్వామి ముఖ్యమంత్రిగా దిగిపోయినా.. కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి వస్తారని.. నిన్నటిదాకా అంచనా వేశారు. కాంగ్రెస్, జేడీఎస్ వర్గాలు కూడా అదే చెప్పాయి. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. జేడీఎస్‌తో.. బీజేపీ టచ్‌లోకి వెళ్లిందనే ప్రచారం జరుగుతోంది.
కర్ణాటక వ్యవహారాలను బీజేపీ చాలా సీరియస్‌గా తీసుకుంది. ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటోంది. అయితే.. ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి.. సభలో కావాల్సిన సభ్యుల సంఖ్యను తక్కువ చేసి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా… ఆ తర్వాత ఎమ్మెల్యేలను గెలిపించుకోలేకపోతే… పరువు పోతుంది. ప్రభుత్వం కూడా కుప్పకూలుతుంది. అదే జరిగితే… జాతీయ స్థాయిలో బీజేపీ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అవుతుంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లుగా చరిత్రలో మిగిలిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత రిస్క్ ఎందుకని… బీజేపీ నేరుగా.. జేడీఎస్‌తో టచ్‌లోకి వెళ్లిందని తెలుస్తోంది. బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు.. బెంగళూరులో మకాం వేసి.. జేడీఎస్ ముఖ్య నేతలతో మంతనాలు జరుపుతున్నారు.
గతంలో బీహార్ లో.. ఆర్జేడీ, జీడీయూ కూటమి ప్రభుత్వాన్ని విచ్చిన్నం చేసి.. జేడీయూతో కలిసి.. బీజేపీ సర్కార్‌ను ఏర్పాటు చేసింది. కర్ణాటకలోనూ అదే తరహాలో కాంగ్రెస్, జేడీఎస్ కూటమిని విచ్చిన్నం చేసి… జేడీఎస్‌తో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటోంది. జేడీఎస్ కలసి వస్తే ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని అంచనా వేస్తోంది. సంఖ్యాబలం రీత్యా.. జేడీఎస్‌కు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. కుమారస్వామి సోదరుడు.. రేవణ్ణకు ఈ పదవి ఆఫర్ ఇచ్చారు. దీంతో.. జేడీఎస్‌లోనూ.. చర్చ జరుగుతోంది. ఇప్పటికిప్పుడు.. ప్రభుత్వం నిలబడటం కష్టం కాబట్టి.. ఏదో విధంగా.. సంకీర్ణ ప్రభుత్వంలో ఉంటే మంచిది కదా అన్నట్లుగా.. వారి ఆలోచనలు ఉన్నాయని తెలుస్తోంది. ఒకటి, రెండురోజుల్లో… ఈ విధంగా లాజికల్ ఎండింగ్‌కు కర్ణాటకం వచ్చినా ఆశ్చర్యం లేదన్న భావన వ్యక్తమవుతోంది.