పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిశాయి. గత సమావేశాలతో పోల్చుకుంటే… ఉన్నంతలో బాగానే జరిగాయని చెప్పుకోవచ్చు. గత సమావేశాల్లో మాదిరిగా సభను స్తంభింపజేసిన పరిస్థితులు ఎదురుకాలేదు. ఈ సమావేశాల్లో అత్యంత కీలకమైన బిల్లుల్ని ఆమోదింపజేసుకోవాలనే లక్ష్యంతో భాజపా మొదట్నుంచీ ఉంది కాబట్టి… సెషన్స్ ప్రారంభం కాగానే ఏపీ అధికార పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని స్వీకరించి, చర్చ జరిపారు. ఆంధ్రా విషయంలో మోడీ సర్కారు అనుసరిస్తున్న మొండి వైఖరి దీని ద్వారా దేశవ్యాప్తంగా తేటతెల్లమైన పరిస్థితి వచ్చింది.
ఈ సమావేశాల ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీరులో స్పష్టత ఏంటంటే… తెలంగాణ రాష్ట్ర సమితికి మరింత చేరువయ్యేట్టు కనిపించారు, ఇదే సమయంలో ఏపీలో తెలుగుదేశం పార్టీని మరింత దూరం పెట్టినట్టు వ్యవహరించారు. అపాయింట్మెంట్ కోరడమే ఆలస్యం అన్నట్టుగా.. ఓసారి మంత్రి కేటీఆర్, మరోసారి కేసీఆర్, సమావేశాలు ఆఖరు రోజున తెరాస ఎంపీలకు కూడా అవకాశం ఇచ్చారు. కానీ, టీడీపీ విషయానికి వచ్చేసరికి… మంకు పట్టు ప్రదర్శించారు. తెరాస వైఖరి కూడా మోడీకి మరింత చేరువౌతున్నట్టుగా పూర్తిగా మారింది. అవిశ్వాస తీర్మానంపై చర్చ నుంచి మొన్నటి రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నిక వరకూ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగానే కేసీఆర్ వ్యవహరించారనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక, ఆంధ్రా విషయానికి ఈ సమావేశాల్లో మోడీ వైఖరి మరింత స్పష్టమైంది. ఏపీ సమస్యల్ని భాజపాగానీ, మోడీగానీ ఏమాత్రం సీరియస్ గా తీసుకోవడం లేదని వారే బల్లగుద్ది పదేపదే చెప్పినట్టయింది. అన్నిటికీ మించి, మోడీ వ్యక్తీకరించిన హావభావాలు తీవ్రమైన ఆగ్రహాన్ని కలిగించే విధంగానే ఈ సమావేశాల్లో కనిపించాయి ఒక దేశ ప్రధానిగా, అన్ని రాష్ట్రాలనూ సమానంగా చూడాలనే ఉద్దేశం ఏకోశానా లేదనేది ఆయన తీరులో మరింత స్పష్టంగా కనిపించింది. సమస్యల్ని ప్రస్థావించి అవిశ్వాస తీర్మానం పెడితే… వాటిపై మాట్లాడకుండా, రాజకీయాలు మాట్లాడారు మోడీ.
ఓవరాల్ గా.. ఈ సమావేశాల్లో తెలుగు రాష్ట్రాల కోణం నుంచి మోడీ వైఖరిని గమనిస్తే, తెరాసను చేరువ చేసుకున్నట్టుగా, టీడీపీని మరింత దూరం పెట్టేట్టుగా వ్యవహరించారు. ఎలాగూ ఆంధ్రా విషయంలో భాజపా రాజకీయం మాత్రమే చేస్తోందన్నది స్పష్టం కాబట్టి… మోడీ ప్రధానిగా ఉండగా ఏపీకి ఏం జరగదనే ఒక స్థిరమైన అభిప్రాయమే బలంగా వినిపిస్తోంది. పోనీ, మోడీకి అత్యంత సన్నిహితులుగా మారిపోయామని భావిస్తున్న తెరాస ఏమైనా సాధించుకుందా అంటే… ప్రస్తుతానికి అదీ కనిపించడం లేదు. బైసన్ పోలో గ్రౌండ్ ఫైలుపై కేంద్రం ఏమాత్రం స్పందించడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సాయం గురించి మాట్లాడలేదు. తాజాగా ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి నిర్వహించలేం, మూసేయాల్సిందే అంటూ మెడికల్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా షాకివ్వడం గమనార్హం. ఇవేకాదు, హైకోర్టు విభజన, ఐటీ పార్కు, విద్యా సంస్థల ఏర్పాటుపై కూడా సానుకూలంగా ఒక్క ప్రకటనా విడుదల కాలేదు. ప్రస్తుతానికి తెరాస ఎప్పుడు అపాయింట్మెంట్ అడిగితే అప్పుడు అన్నట్టుగానే ఇస్తున్నారంతే! ఆంధ్రా విషయంలో అది కూడా లేదు.