డీజే టిల్లు… కుర్రకారుని కిర్రెక్కించిన సినిమాల్లో ఒకటి. ఇప్పుడు దానికి సీక్వెల్ రెడీ అవుతోంది. డీజే టిల్లు స్క్వేర్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్నారు. డీజే టిల్లులో .. టైటిల్ సాంగ్ సూపర్ హిట్. ఆ పాటే జనాల్ని థియేటర్లకు రప్పించింది. అలాంటి పాటే… టిల్లు స్క్వేర్లోనూ సెటప్ చేశారు. ఈసారీ ఈ పాటని రామ్ మిరియాలే స్వర పరచి పాడారు. కాశర్ల శ్యామ్ రాశారు. ”టికెట్టే కొనకుండా లాటరీ కొట్టిన చిన్నోడా” అంటూ సాగిన ఈ పాట ఆద్యంతం సరదాగా ఉంది. ఇందులో డీజే టిల్లు క్యారెక్టరైజేషన్ మొత్తం వినిపించింది. కొన్ని పదాలు భలే పడ్డాయి.
”గాలికి పోయే కంప నెత్తికొచ్చి చుట్టుకున్నాదీ
ఆలు లేదు.. సూలూ లేదు గాలి తప్ప మేటరు లేదు
ఏది ఏమైనా గానీ టిల్లుగాడికి అడ్డేలేదు..
టిల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా
స్టోరీ మల్లీ రిపీటేనా
పోరి దెబ్బకు మళ్లీ నువ్వు తానా తందానా..” – ఇలా సాగింది పాట.
హీరోని డీగ్రేట్ చేస్తూనే, తన పై పంచులేస్తూనే, స్టోరీ మొత్తం చెప్పే ప్రయత్నం చేశారు. పాట హుషారుగా ఉంది. జానీ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులు కూడా నీట్ గానే ఉన్నాయి. డీజే టిల్లు టైటిల్ సాంగ్ లానే, ఈ పాట కూడా కొంతకాలం హల్ చల్ చేసే అవకాశం ఉంది. అనుపమని కూడా ఒకింత సెక్సీగానే చూపించారు ఇందులో. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మిస్తున్నారు.