గత 10 ఏళ్లుగా దేశంలో కాంగ్రెస్ పాలన సాగినంత కాలం ఘరానా అల్లుడు రాబర్ట్ వాద్రా చిలక్కొట్టుళ్ళ గురించి అనేక సీరియల్ కధలు వినిపించినప్పటికీ, ఎవరూ అతనిపై చర్యలు చేప్పట్టే సాహసం చేయలేకపోయారు. సాహసం చేసిన అశోక్ ఖిమ్కా అనే ఐ.ఏ.యస్. అధికారి రెండేళ్లలో 44 సార్లు బదిలీ అయ్యాడు. కానీ కాంగ్రెస్ పోయింది బీజేపీ అధికారంలోకి వచ్చిందిప్పుడు. కనుక ఘరానా అల్లుడుగారి ఎక్కడెక్కడ భూములు గిల్లుకొన్నాడో సంబంధిత అధికారులు లెక్కలు తీస్తున్నారు.
హర్యానా, ఉత్తర ప్రదేశ్ తరువాత తాజాగా రాజస్థాన్ లో బీకనీర్ పట్టణంలో ఆయనకు చెందిన ఒక కంపెనీ ప్రభుత్వానికి టోపీ పెట్టేసి 374.44 హెక్టార్ల భూమిని బినామీ పేర్లతో స్వంతం చేసుకొనే ప్రయత్నం చేసింది. కానీ అది గుర్తించిన రాజస్థాన్ ప్రభుత్వం ఆ సంస్థకు కేటాయించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకొంది. ఈ వ్యవహారంలో భారీగా జరిగిన నిధుల బదలాయింపులపై మీడియాలో అనేక కధనాలు వచ్చాయి. వాటి ఆధారంగా ఈడి అధికారులు సదరు కంపెనీపై ఒక కేసు నమోదు చేసారు. ఆ కంపెనీకి చెందిన కొందరు ఉన్నతాధికారులు, వారికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పేర్లు ఎఫ్.ఐ.ఆర్.లో చేర్చారు. కానీ ఇంకా రాబర్ట్ వాద్రా వంతు రాలేదు కనుక ఆయన పేరు చేర్చలేదు. కానీ ఆ వ్యక్తులు అందరినీ ప్రశ్నించేందుకు త్వరలో ఈడీ అధికారులు నోటీసులు పంపబోతున్నారు. వారు బయటపెట్టబోయే వివరాలను బట్టి రాబర్ట్ వాద్రాకి కూడా పిలుపు రావచ్చును.
గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నట్లు, ఆ కంపెనీ అధికారులపై కేసు నమోదు చేయగానే, “ఇది రాజకీయ దురుదేశ్యంతోనే చేస్తున్నారు. మాపై రాజకీయ కక్ష సాధించడానికే కేసు నమోదు చేసారు,” అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్ అన్నారు. చేయవలసిన తప్పులు అన్నీ చేసి ఎవరయినా చర్యలు చెప్పట్టగానే అది రాజకీయ కక్ష సాధింపు అని కలరింగ్ ఇవ్వడం ఈరోజుల్లో ఒక రాజకీయ సంప్రదాయంగా మారిపోయింది. ‘రాజకీయ కక్ష సాధింపు’ అనే విమర్శలకి భయపడితే ఇక రాజకీయ నాయకులెవరినీ ప్రశ్నించడానికి కూడా వీలుండదు. రాజకీయ నాయకులపై ఇటువంటి కేసులు పెట్టినప్పుడు వాటిని ఏవిధంగా ఎదుర్కోవాలో వారికీ చాలా బాగా తెలుసు. కనుక ప్రభుత్వం వారి విమర్శలకు భయపడాల్సిన అవసరం కూడా లేదు.