విజయవాడ నెత్తురోడుతోంది. శాంతిభద్రతల ఆచూకీ మచ్చుకైనా కనిపించని పరిస్థితి ఏర్పడుతోంది. నాటుతుపాకీలతో హత్యల దగ్గర్నుంచి ప్రేమించలేదని అమ్మాయిల్ని నరికి చంపడం వరకు యథేచ్చగా సాగిపోతున్నాయి. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రీస్తురాజుపురంలో దివ్య తేజస్విని అనే ఇంజినీరింగ్ విద్యార్థినిని ..ప్రేమోన్మాది గొంతు కోసి చంపేశాడు. కార్పెంటర్‌గా పని చేసే నాగేంద్రబాబు.. దివ్యతేజస్విని అనే ఇంజినీరింగ్ విద్యార్థినిని ప్రేమించాడు. అయితే అది వన్ సైడ్ లవ్. తననుకూడా ప్రేమించాలని వెంటపడ్డాడు. ఆ యువతి తిరస్కరించడంతో వేధించడం ప్రారంభించాడు. చివరికి తనకు దక్కకుండా పోతుందన్న ఉద్దేశంతో హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.
కత్తి తీసుకుని నేరుగా ఇంటికి వెళ్లాడు. మాట్లాడాలని పిలిచి గొంతుపై కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ యువతి మృతి చెందింది. దాడి తర్వాత కత్తితో తనను తాను గాయపర్చుకున్నాడు. అయితే జనం కొట్టి చంపుతారన్న ఉద్దేశంతో స్వల్పంగానే గాయపరుచుకున్నాడు. దాంతో ఆ ఉన్మాదిని పోలీసులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. బెజవాడలో వరుసగా జరుగుతున్న ఘటనలు అన్నీ పోలీసుల నిర్లక్ష్యంతోనే సాగుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గ్యాంగ్ వార్లు..అమ్మాయిల హత్యలు కామన్‌గా మారిపోయిన విధానం.. నేరస్తుల్ని పట్టుకుని గట్టిగా శిక్షించలేని దైన్యం పోలీసులకు ఏర్పడింది. ప్రతీ ఒక్క నేరస్తుడు రాజకీయ ప్రాబల్యంతో జబర్దస్తీ చేస్తూండటంతో పోలీసులు కూడా.. నిస్సహాయంగా మారిపోతున్నారు. ఈ పరిస్థితి నేరగాళ్లలో భయం తగ్గడానికి కారణం అవుతోంది. నేరాలు పెరిగిపోవడానికి కారణం అవుతోంది. ఘటనలు జరిగినప్పుడు హడావుడిగా ప్రభుత్వ తరపున కొంత మంది బాధితుల్ని పరామర్శించి వెళ్తున్నారు. పోలీసులు గంభీరమైన ప్రకటనలు చేస్తున్నారు. తర్వాత షరా మామూలుగా అయిపోతోంది.