తొలి వన్డేలో పరాజయానికి ఇంగ్లండ్ జట్టు ప్రతీకారం తీర్చుకుంది. ఏకంగా 337 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది. దాంతో…. వన్డే సిరీస్ ని 1-1కి సమయం చేసింది. సిరీస్ విజేతని నిర్ణయించే కీలకమైన వన్డే.. ఈ ఆదివారం పుణేలోనే జరగబోతోంది.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 336 పరుగుల భారీ స్కోరు సాధించింది. కె.ఎల్.రాహుల్ (108) సెంచరీకి పంత్ మెరుపు ఇన్నింగ్స్ (40 బంతుల్లో 77) తోడవ్వడంతో పరుగులు వరదలై పారాయి. కోహ్లి (66) మరోసారి కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం బ్యాటింగ్ కి దిగిన ఇంగ్లండ్ కి బెన్ స్ట్రో, రాయ్ మరోసారి సెంచరీ భాగస్వామ్యం అందించారు. రాయ్ (55) అవుటైనా.. బెన్ స్ట్రో తన దూకుడు కొనసాగిస్తూ సెంచరీ (124) సాధించాడు. అయితే…. స్ట్రోక్ట్స్ మెరుపు దాడి (52 బంతుల్లో 99) చేయడంతో… 337 పరుగుల లక్ష్యం కూడా చిన్నదైపోయింది. ఒక్క పరుగు తేడాతో సెంచరీని కోల్పోయినా.. ఇంగ్లండ్ ని విజయం ముంగిట నిలిపాడు. తొలి వన్డేలో అనూహ్యంగా విజృంభించి ఇంగ్లండ్ ని కట్టడి చేసిన టీమ్ ఇండియా బౌలర్లు… ఈసారి తేలిపోయారు. ముఖ్యంగా స్పిన్నర్లు కులదీప్, కృనాల్ భారీగా పరుగులు ఇచ్చేశారు. వీరిద్దరూ ఏకంగా 156 పరుగులు ప్రత్యర్థికి కట్టబెట్టారు. ఇంగ్లండ్ ఏకంగా 20 సిక్సులు బాదేసింది. దాంతో… ఆరు వికెట్ల తేడాతో భారత్ ని ఓడించింది.