యునైటెడ్ కింగ్డమ్ చరిత్రలో కొత్త అధ్యాయం. బ్రెగ్జిట్ తో పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందని భావిస్తున్న ఆ దేశానికి కొత్త ప్రధానిగా థెరెసా మే పగ్గాలు చేపట్టబోతున్నారు.
మార్గరెట్ థాచర్ తర్వాత, మరో మహిళ థెరెసా మే ప్రధాన మంత్రి కావడం ఖాయమైంది. ప్రస్తుత ప్రధాని డేవిడ్ కామెరాన్ ఈ విషయం ప్రకటించారు.
తాను బుధవారం నాడు రాజీనామా చేస్తానని, ఆ తర్వాత థెరెసా పదవీ బాధ్యతలు చేపడతారని తెలిపారు. యూరోపియన్ యూనియన్ నుంచి యూకే వైదొలగాలని మెజారిటీ ప్రజలు రెఫరెండంలో తీర్పు చెప్పారు. దీంతో ప్రధాని పదవి నుంచి వైదొలగుతానని కామెరాన్ ఇదివరకే ప్రకటించారు.
ఈ పదవికోసం థెరెసాతో పోటీ పడిన ఆండ్రియా లీడ్సమ్ బరినుంచి వైదొలగాలని నిర్ణయించడం సరైన నిర్ణయమని కామెరాన్ అన్నారు. బుధవారం ఇంగ్లండ్ దిగువ సభలో ప్రశ్నలకు జవాబు ఇచ్చిన తర్వాత నేరుగా ఎలిజబెత్ రాణి వద్దకు వెళ్లి రాజీనామా సమర్పిస్తానని చెప్పారు. ఆ తర్వాత థెరెసాను పదవీ బాధ్యతలు చేపట్టాల్సిందిగా రాణి లాంఛనంగా ఆహ్వానిస్తారు.
ఒకప్పుడు బ్రిటిష్ ప్రధానిగా దశాబ్దం పైగా పనిచేసిన మార్గరెట్ థాచర్ ఉక్కు మహిళగా పేరు పొందారు. ఆమె 1979 నుంచి 1990 వరకు ప్రధానిగా ఉన్నారు. 20వ శతాబ్దం నుంచి ఎక్కువ కాలం పాలించిన బ్రిటిష్ ప్రధానిగా ఆమె రికార్డు సృష్టించారు. ఆనాడు కన్సర్వేటివ్ పార్టీ తరఫున మార్గరెట్ థాచర్ ప్రధాని అయ్యారు. ఇప్పుడు లేబర్ పార్టీ తరఫున థెరెసా మే ప్రధాని కాబోతున్నారు.
బ్రెగ్జిట్ తర్వాత యూకేలో చాలా మార్పులు రావడం తథ్యం. ఈ పరిణామం వల్ల లాభ నష్టాలుంటాయి. నష్టాలను నివారించడం లేదా తగ్గించడం పెద్ద సవాలు. థెరెసా మే ఈ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారనేది కామెరాన్ నమ్మకం. మార్గరెట్ థాచర్ లా ఈమె కూడా ఉక్కు మహిళగా సమర్థంగా పరిపాలిస్తారని ఆమె సహచరులు భరోసాతో ఉన్నారు.