ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈనాడు దినపత్రిక మూడేళ్ల పాటు “రిపోర్టింగ్” మాత్రమే చేసింది. ఆ రిపోర్టింగ్‌లోనూ నిజాలు చూసి భుజాలు తడుముకోవడం వైసీపీ అధినేత దగ్గర్నుంచి కింది స్థాయి వరకూ జరిగింది. ఇప్పుడు ఈనాడు అసలు జర్నలిజాన్ని ప్రారభించింది. పాలకుల దోపిడీలు, దౌర్జన్యాలు, మాట తిప్పుళ్లు. ప్రజలను దోపిడీ చేసుకోవడం గురించి రాస్తోంది. ప్రతీ రోజూ వస్తున్న బ్యానర్ స్టోరీలు వైసీపీ నేతలకు నిద్రపట్టకుండా చేస్తున్నాయి. ఈరోజు రాజధానిపై వైఎస్ జగన్ సహా ఆ పార్టీ నేతలు ఎన్నికలకు ముందు వరకూ చేసిన అమరావతి జపం గురించి.. ఇప్పుడు చేస్తున్న మూడు రాజధానుల వాదనల గురించి సమగ్రంగా వివరించారు.
నిజానికి జగన్ మడమ తిప్పిన వ్యవహారం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంది. ఇతర నేతల నాలుక మడతేయడంమూ అంతే. అయితే ఈనాడు చెప్పడం వేరు. ఆ పవర్ ఎలా ఉంటుందో వైసీపీ నేతలకు బాగా తెలుసు. అందుకే ఈనాడు ప్రతి రోజూ ఏం రాస్తుందో అని ఉలిక్కి పడాల్సి వస్తోంది. ఈ రోజు ఈనాడు పత్రికను చూసిన వారెవరైనా.. ఏపీ ప్రజల్ని .. వైసీపీ నేతలు ఎంత తక్కువగా అంచనా వేస్తున్నారో సులువుగా అర్థం చేసుకుంటారు. అధికార మదం తలకెక్కి ఎలా ప్రవర్తిస్తున్నారో అంచనా వేసుకుంటారు.
ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎండగట్టడానికి ఈనాడు కు ఇంకా చాలా స్కోప్ ఉంది. అంత చాన్స్ ప్రభుత్వమే ఇచ్చింది. ఒక్క లిక్కర్ వ్యవహారం మీదే నెల రోజుల పాటు కథనాలు రాసుకోవచ్చు. ఓటు బ్యాంక్ అయిన బడుగు, బలహీనవర్గాల కుటుంబాల్ని .. మద్యం రేట్లు పెంచడం ద్వారా జగన్ ఎలా పీల్చి పిప్పి చేశారో సిరీస్‌గా రాస్తే.. వారి కుటుంబాల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో కళ్ల ముందు పెడితే వైసీపీ నేతలు సిగ్గుతో తలదించుకుంటారు. ఏటా ప్రభుత్వం రూ. పాతికవేల కోట్ల ఆదాయాన్ని మద్యం ద్వారా తెచ్చుకుంటోంది. ఇందులో 90 శాతం రోజువారీ కూలీ చేసుకునే బడుగులదే. ఇలా కూడా ప్రజల్ని ప్రభుత్వాలు దోచుకుంటాయా అని ఆశ్చర్యపరిచే రీతిలో నిజాలు వెలుగులోకి వస్తాయి. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అన్నింటినీ ఈనాడు బయటపెడితే వైసీపీ నేతలు బిక్కచచ్చిపోవడం ఖాయం.