తెలంగాణలో కఠినమైన లాక్డౌన్ అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు సంకేతాలు పంపుతున్నారు. తెలంగాణలో జరగాల్సిన వివిధ రకాల ఎంట్రన్స్ పరీక్షలన్నింటినీ రద్దుచేశారు. జూలై ఒకటో తేదీ నుంచి ఆగస్టు పదిహేనో తేదీ వరకు షెడ్యూల్ చేసిన ఎలాంటి ప్రవేశ పరీక్ష కూడా జరగదు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్లో కరోనా కేసులు ఊహించని స్థాయిలో పెరుగుతూండటంతో ప్రభుత్వం లాక్ డౌన్ నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోంది. ఇప్పటికే ఈ విషయంలో స్పష్టమైన సంకేతాలు పంపారు. ఏదో కొద్దిగా లాక్ డౌన్ విధించడం కాకుండా.. సంపూర్ణంగా.. ప్రజల కదలికలు మొత్తం కట్టడి చేయాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు.
పరిమితంగా నడుస్తున్న రైళ్లు, విమానాల రాకపోకలతో పాటు.. బస్సులు సహా మొత్తం నిలిపివేయనున్నారు. నిత్యావసర వస్తవుల కోసం సమయం గంటా లేదా రెండు గంటలు మాత్రమే కేటాయిస్తారు. ఇక ఎవరికీ ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా.. పూర్తి స్థాయిలో కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తే… కరోనా కంట్రోల్లోకి వస్తుందన్న అంచనా అధికారుల్లో ఉంది. ఈ మొత్తం వ్యవహారంపై… లాక్ డౌన్ ఎంత కఠినంగా అమలు చేయాల్నదానిపై అధికారులు ఇప్పటికే ఓ నివేదిక సిద్ధం చేశారు. దీనిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. బుధ లేదా గురువారాల్లో కేబినెట్ భేటీ జరిపే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. కేబినెట్ భేటీ అయిపోయిన తర్వాత కఠినమైన లాక్ డౌన్ విధివిధానాలు ప్రకటించే అవకాశం ఉంది.
ఇతర మెట్రో నగరాలతోపోలిస్తే.. హైదరాబాద్లో వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉందని ప్రభుత్వం చెబుతున్నా.. చేస్తున్న టెస్టులతో పోలిస్తే.. పాజిటివ్ శాతం చాలా ఎక్కువగా అంచనా వేస్తున్నారు. సామాజిక వ్యాప్తి దశకు చేరితే మరింత ప్రమాదకరమని ప్రభుత్వం అంచనాకు వచ్చింది. అన్నింటి కన్నా.. ఈ కరోనా కట్టడికే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకుంది. మద్యం షాపులు కూడా.. పదిహేను రోజుల పాటు మూసివేయనున్నారు. అందుకే.. ఇప్పటికే.. తెలంగాణలో మద్యం షాపు.. నిత్యావసర వస్తువుల దుకాణాల్లో రద్దీ కనిపిస్తోంది.