తెలంగాణా రాష్ట్రం ఏర్పడగానే అధికారంలోకి వచ్చిన తెరాస పార్టీ మొదట్లో చాలా దూకుడుగా వ్యవహరించింది. ఆ కారణంగా తరచూ హైకోర్టు చేత మొట్టికాయలు వేయించుకోవడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఘర్షణ పడవలసి వచ్చేది. ఆ వేడిలో తీసుకొన్న నిర్ణయమే వాహనాలపై ప్రవేశపన్ను విధింపు. ఆంధ్రా నుండి తెలంగాణాలోకి ప్రవేశించే అన్ని వాహనాలపై ప్రవేశపన్ను విదించింది. దానిపై ఇరు రాష్ట్రాల మధ్య జరిగిన చర్చలు ఫలించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలంగాణా వాహనాల నుంచి ప్రవేశపన్ను వసూలు చేయడం మొదలుపెట్టింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాల పంతాలకు, పట్టింపులకి మధ్యలో వాహనాల యజమానులు నలిగిపోతున్నారు. వారు తమ సమస్యలను రెండు ప్రభుత్వాలకు మొరపెట్టుకొని ప్రవేశపన్నుపై తమ నిర్ణయంపై పునరాలోచించుకోవలసిందిగా కోరారు కానీ ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇంతకాలంగా ఘర్షణ వాతావరణం నెలకొని ఉండటంతో వారిది అరణ్యరోదనే అయ్యింది.
ఈ ఏడాదిన్నర కాలంలో ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకు ఈ ప్రవేశపన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని పోల్చి చూచుకొంటే, దీని వలన తెలంగాణా కంటే ఆంధ్రాకే ఎక్కువ ప్రయోజనం చేకూరుతున్నట్లు తేలింది. ఎందుకంటే సిమెంట్, స్టీల్, గ్రెనైట్, తదితర భవన నిర్మాణ ఉత్పత్తులు, హైదరాబాద్ లో తయారయ్యే భారీ యంత్ర పరికరాలు వగైరా అన్నీ వాహనాల ద్వారా ఆంధ్రాకు వస్తుంటాయి. పైగా తెలంగాణాకు అత్యంత సమీప నౌకాశ్రయాలన్నీ ఆంధ్రాలోనే ఉండటం చేత తెలంగాణా నుండి విదేశాలకు ఎగుమతి చేయవలసిన వివిధ ఉత్పత్తులు, వస్తువులు, యంత్రాలు అన్నీ ఆంధ్రా ద్వారానే ఎగుమతి చేయవలసి ఉంటుంది. అదే ఆంధ్రా నుంచి కొన్ని రకాల ఆహార ఉత్పత్తులు వగైరా, ఆర్టీసీ మరియు ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా మాత్రమే తెలంగాణా ప్రభుత్వానికి ప్రవేశపన్ను ద్వారా పరిమిత ఆదాయం సమకూరుతోంది. ఆంధ్రా, తెలంగాణా రాష్ర్టాల ఈ ఆదాయాలు సుమారు 6:4 నిష్పత్తిలో ఉన్నట్లు తేలింది. అంటే తెలంగాణా కంటే ఆంధ్రాకే ఎక్కువ ఆదాయం లభిస్తోందన్నమాట! అందుకే ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం తన నిర్ణయంపై పునరాలోచన చేసి దానిని వెనక్కు తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆంధ్ర, తెలంగాణా ముఖ్యమంత్రుల మధ్య ఇటీవల కాలంలో సఖ్యత ఏర్పడటంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈవిషయంలో వెనక్కి తగ్గేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అసలు ప్రవేశపన్ను లేకపోతే రెండు రాష్ట్రాలు చాలా బారీగా ఆదాయం కోల్పోతాయి కనుక డబుల్ ఎంట్రీ విధానం ఎత్తివేసి సింగల్ ఎంట్రీ టాక్స్ విధానం అమలుచేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తాజా సమాచారం.