ఓ వైపు విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం దుమారం రేగుతూండగా.. ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందనలు లేకపోవడం తీవ్ర దుమారం రేపుతూండగా… కొత్తగా చేసే ప్రచారాలు ప్రజలను మరింత ఆగ్రహం తెప్పించేలా ఉన్నాయి. కడపలో సున్నపురాళ్ల పల్లెలో ఏపీ ప్రభుత్వం కట్టాలనుకున్న స్టీల్ ఫ్యాక్టరీకి కేంద్రం పర్యావరణ అనుమతులు మంజూరు చేసిందట. ఏపీ సర్కార్ దీన్ని పెద్దఎత్తున ప్రచారం చేసుకుంటోంది. గత ఏడాది డిసెంబర్లోనే తాము దరఖాస్తు చేసుకున్నామని.. శరవేగంగా అనుమతులు తెచ్చుకున్నామని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వ తీరు ఎలా ఉందంటే.. ఇక స్టీల్ ప్లాంట్ ప్రారంభించడమే తరువాయి అన్నట్లుగా ఉంది. నిజానికి పర్యావరణ అనుమతులు అనేది చాలా చిన్న ప్రక్రియ. అసలు అంశం .. ఎవరు ప్లాంట్‌కు పెట్టుబడి పెడతారు అన్నదే.
ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ పేరుతో ప్రత్యేకంగా సంస్థను ఏర్పాటు చేసిన ఏపీ సర్కార్ ఇంత వరకూ… కడప స్టీల్ ప్లాంట్ విషయంలో ఎలాంటి ముందడుగూ వేయలేకపోయింది. అతి కష్టం మీద పర్యావరణ అనుమతులు తీసుకుంది. ఈ పర్యావరణ అనుమతులు స్టీల్ ప్లాంట్‌లో పరిరక్షించాల్సిన పర్యావరణం గురించి మాత్రమే. కనీసం ప్లాంట్ కోసం… టెక్నికల్ అనుమతులు కూడా కాదు. అసలు ఈ పర్యావరణ అనుమతులు తీసుకు రావడానికి ప్రభుత్వం కిందా మీదా పడింది. ఓ సారి అరకొర సమాచరారంతో ధరఖాస్తు చేయడంతో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏపీ ప్రభుత్వం దరఖాస్తును వెనక్కి పంపింది. రెండో సారి పంపి అనుమతులు తీసుకున్నారు.
సీఎం జగన్ 2019 డిసెంబర్ 24న స్టీల్ ప్లాంట్‌కు కొబ్బరికాయ కొట్టారు. మూడంటే మూడేళ్లలో ఉక్కు పరిశ్రమ ఉత్పత్తి ప్రారంభించేలా చేస్తానని ఆయన ప్రకటించారు. అందు కోసం పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడుతున్నట్లుగా కూడా చెప్పారు. రూ.15 వేల కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ పరిశ్రమ ద్వారా 25 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయని కూడా చెప్పారు. చైనాతో పాటు వివిధ దేశాలకు చెందిన సంస్థలతో మాట్లాడుతున్నట్లుగా ప్రభుత్వం చెప్పింది కానీ ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు. గతంలో పోస్కో ప్రతినిధులతో సీఎం చర్చలు జరిపినప్పుడు… కడప ఉక్కు కోసం అనుకున్నారు. సీఎం కూడా అదే చెప్పారు. కానీ కడపలో ఆసక్తి చూపలేదన్నారు. మరి పర్యావరణ అనుమతులు కూడా తీసుకొచ్చారు కాబట్టి ప్రభుత్వం కడుతుందా.. లేకపోతే.. వేచి చూస్తుందా అన్నది క్లారిటీ లే్దు.