పరీక్ష రాసిన విద్యార్థి తను రాసిన వాటికి ఎన్ని మార్కులు వస్తాయో .. స్వయంగా లెక్కలేసుకుంటాడు. ఓ అంచనాకు వస్తాడు. తేడా వస్తే.. రీ వాల్యుయేషన్ పెట్టించుకుంటాడు. అందులో తను అనుకున్నట్లు వస్తాయో.. తగ్గుతాయో అది వేరే విషయం.. ఈ కాన్సెప్ట్ తెలంగాణ ప్రభుత్వానికి బాగా నచ్చింది. కాకపోతే రివర్స్‌లో ఉపయోగించుకుంది. …ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.. ఈవోడీబీ ర్యాంకుల్లో “ఫస్ట్” ఎందుకు రాలేకపోయామా అని కొన్ని రోజులుగా మధన పడిపోతోంది. దాన్ని అలానే దాచుకోకుండా.. స్వయంగా.. ప్రపంచబ్యాంక్, కేంద్రం కలిపి చేస్తున్న గణన ప్రకారం.. మొత్తం అన్ని రాష్ట్రాల ప్రామాణికాల్ని సొంతంగా లెక్కించారు. ఆ లెక్కల ప్రకారం చూస్తే.. ఆంధ్రప్రదేశ్‌కు ఎక్కువ మార్కులేసినట్లు గుర్తించారు. ఈవోడీబీ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ 98.42 పర్సంటేజీతో మొదటి స్థానంలో ఉంది. తెలంగాణ, 98.33 శాతం స్కోరుతో రెండో స్థానంలో నిలిచింది. ప్రామాణికాల ప్రకారం చూస్తే ఏపీకి కూడా 98.33 శాతం మాత్రమే స్కోర్ రావాలంటోంది తెలంగాణ ప్రభుత్వం.
ఈవోడీబీలో 372 సంస్కరణల పరిగణనలోకి తీసుకోవడంతోపాటు పారిశ్రామికవర్గాల అభిప్రాయాలను సేకరించి ర్యాంకులను ప్రపంచ బ్యాంక్, కేంద్రం కలిసి ప్రకటిస్తాయి. పరిశ్రమల ఫీడ్ బ్యాక్ సేకరించిన విధానంంలో ఏపీకి ఎక్కువ మార్కులు కేటాయించినట్లు తెలంగాణ వాదిస్తోంది. మూల్యాంకనం, మార్కుల గణనలో తప్పులను సరిదిద్ది తుదిర్యాంకులను సెవరించాలని కేంద్రాన్ని తెలంగాణ కోరుతోంది. గణనలో తప్పులతో మూడోస్థానంలో నిలువాల్సిన జార్ఖండ్ నాలుగు, ఆరులో నిలువాల్సిన మధ్యప్రదేశ్ ఏడోస్థానంలో నిలిచాయిని తెలంగాణ .. ఆయా రాష్ట్రాల మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఢిల్లీలో ఇదే పని మీద ఉన్నారు. ర్యాంకులను మార్చాలని.. ఏపీతో పాటు.. తెలంగాణకూ మొదటి స్థానం ఇవ్వాలని పట్టుబడుతున్నారు.
అయితే తెలంగాణ ప్రభుత్వం డిమాండ్‌ను కేంద్ర పరిశ్రమల శాఖ పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ ఈ విషయాన్ని మాత్రం వదిలి పెట్టకూడదన్న ఆలోచనలో కేటీఆర్ ఉన్నారు. ఎంపీలతో పార్లమెంట్లో కూడా… తమ అభ్యంతరాలను వినిపించాలన్న ఆలోచన చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున.. కేంద్ర పరిశ్రమల మంత్రికి కూడా ఫిర్యాదు చేయబోతున్నారు. మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మొదటి ర్యాంకులో ఉండాల్సిందేనని తెలంగాణ గట్టి పోరాటమే చేస్తోంది.