కేసుల రాజకీయాలు తెలిసిందే! ఒక నాయకుడిని లేదా కొంతమందిని కంట్రోల్ చెయ్యాలంటే ఒక్కోసారి ఒక్క కేసు చాలు. కొన్ని సందర్భాల్లో నాయకుల్ని నియంత్రించగలిగే సులువైన మార్గం ఇదే! ఇదే తరహాలో ఎప్పటిదో ఒక పాత కేసు తెలంగాణ రాజకీయాల్లో తెర మీదికి వస్తోంది. వరంగల్ డీసీసీ బ్యాంకు కుంభకోణం మరోసారి ఇప్పుడు వార్తల్లోకి రాబోతోంది. ఎందుకంటే, గతంలో ఈ బ్యాంకు కేంద్రంగా జరిగిన అవినీతిపై సమగ్ర దర్యాప్తు ఇప్పుడు జరిపించాలనీ, దోషుల నిగ్గు తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. విచారణను సీఐడీకి ఇప్పుడు అప్పగించింది. కేవలం అవినీతి రంగు తేల్చేందుకే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమా ఇది..? దీని వెనక ఏదైనా రాజకీయ ప్రయోజనాల ప్రేరేపిత ప్రోత్సాహం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఇదంతా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొంతమంది కాంగ్రెస్ నేతలను లక్ష్యంగా చేసుకుని అధికార పార్టీ ప్రారంభించిన ఆపరేషన్ గా కొన్ని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పంట రుణాల పేరుతో డీసీసీ బ్యాంకులో దాదాపు రూ. 8 కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలు రెండేళ్ల కిందట తీవ్ర చర్చనీయమయ్యాయి. అప్పట్లో, ప్రస్తుత కాంగ్రెస్ నేత జంగా రాఘవరెడ్డి ఛైర్మన్ గా ఉండేవారు. గడచిన ఎన్నికల్లో తెరాస నేత ఎర్రబెల్లి దయాకరరావు మీద ఆయన పాలకుర్తిలో పోటీ చేసి ఓడిపోయారు. అయితే, అప్పట్నుంచీ ఆయన మరింత యాక్టివ్ గా ఉంటున్నారు. మరో ఐదేళ్లు టార్గెట్ గా పెట్టుకుని ఇప్పట్నుంచే గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో జనగామ జిల్లాలో రాఘవరెడ్డి కాంగ్రెస్ తరఫున కీలక పాత్రే పోషించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేతగా ఆయన ఎదిగే అవకాశం ఉందనీ అంటున్నారు. అయితే, జంగాతోపాటు ఇతర కాంగ్రెస్ నేతలకి చెక్ పడాలంటే రెండేళ్లుగా పెండింగ్ లో ఉన్న డీసీసీ బ్యాంకు అవినీతి కేసులో కదలిక తేవాలనే ప్రయత్నం మంత్రి ఎర్రబెల్లి చేశారనే గుసగుసలూ వినిపిస్తున్నాయి.
ఈ కేసు ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఈ మధ్య మరింత యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేతలందరికీ ఝలక్ ఇచ్చినట్టు అవుతుందని తెరాస వర్గాల్లో వినిపిస్తోంది. దీనికి తగ్గట్టుగా, ప్రభుత్వ నిర్ణయం వెలువడగానే… రెండేళ్లూ లేనిది, ఇప్పుడే ఎందుకు కదలిక వచ్చిందని కాంగ్రెస్ నేతలకు షాక్ తిన్నట్టు సమాచారం. ఈ కేసు తెరమీదికి వస్తే… జిల్లాలో కొంతమంది కాంగ్రెస్ నేతలకు చెక్ పడుతుందనీ, వాళ్లు దూకుడుకి బ్రేక్ పడుతుందనేది వ్యూహంగా తెలుస్తోంది. ఈ ప్రణాళిక వెనక మంత్రి హస్తం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.