ఆర్టీసీ సమ్మెపై మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రైవేటీకరణ తప్పదంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం కార్మికులు చేస్తున్న సమ్మె అంశమై ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుందనే స్పష్టత ఇప్పటికీ లేదు. ఆర్టీసీలో కొంత భాగం ప్రైవేటీకరణ, ప్రస్తుతం కార్మికులు చేస్తున్న సమ్మె… ఈ రెండూ వేర్వేరు అంశాలైనా, ప్రైవేటీకరణ ఒక్కటే సమ్మెకు పరిష్కారం అన్నట్టుగా ప్రభుత్వం తీరు ఉంటోంది. మంత్రి ఎర్రబెల్లి కూడా ఇదే తరహాలో మాట్లాడారు. అన్నింటికీ ప్రైవేటీకరణే పరిష్కారం అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆర్టీసీ కార్మికులకు తాము వ్యతిరేకం కాదన్నారు. అయితే, సమ్మెపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని త్వరలోనే వెలువరిస్తుందని చెప్పారు. కార్మికుల పట్ల ప్రభుత్వానికి ఎలాంటి వ్యతిరేకత లేదంటూనే, యూనియన్లపై సీరియస్ గా ఉందన్నారు మంత్రి. ఆర్టీసీ ఇప్పట్లో కోలుకునే అవకాశం కనిపించడం లేదన్నారు. 50 శాతం ప్రైవేటీకరణ చేస్తేనే ఇప్పుడున్న సమస్యను కొంత బేలన్స్ చేసే మార్గం ఉందన్నారు. ఆ మధ్య జరిగిన ఎన్నికల్లో ఆర్టీసీ కార్మికులు, ఉపాధ్యాయుల నుంచి ప్రభుత్వానికి కొంత వ్యతిరేకత వ్యక్తమైన మాట వాస్తవమే అన్నారు.
కార్మికులపై కోపం లేదు, యూనియన్లు అంటేనే పడదు అనడం విచిత్రం! ఎందుకంటే, యూనియన్లు అంటే వాటిలో ఉండేది కార్మికులే కదా! కార్మికులు ఐకమత్యంగా ఉండటం ఇష్టం లేదన్న అంశాన్ని ఇలా చెప్పారని అనుకోవాలా..? వాస్తవం మాట్లాడుకుంటే… ఈ యూనియన్లే కదా ఉద్యమ సమయంలో కేసీఆర్ కి అండగా నిలిచింది. ఇవే యూనియన్లే కదా అప్పట్లో ప్రత్యేక రాష్ట్రం కోసంగా బలంగా పోరాడింది. కానీ, ఇప్పుడా యూనియన్లు అంటేనే కేసీఆర్ కి కోపం అంటే ఎలా..? ఇంకోటి… 50 శాతం ప్రైవేటీకరణే సమస్యకు పరిష్కారం అని ఏ ప్రాతిపదిక చెబుతున్నారనేది మంత్రి ఇంకా సవివరంగా చెప్పాల్సింది! ప్రస్తుతం కార్మికులు సమ్మె చేస్తున్న డిమాండ్లు వేరు, ఆర్టీసీ సమస్యకు ప్రైవేటీకరణ రూపంలో ప్రభుత్వం చూపిస్తామంటున్న పరిష్కారం వేరు. ప్రైవేటీకరణతో వారి డిమాండ్లు ఎలా నెరవేరుతాయి..? 50 వేలమంది సమ్మె చేస్తుంటే… కొందరు మరణిస్తుంటే… వారి డిమాండ్లను పూర్తిగా పెడచెవిన పెట్టి, వారితో నిరసనల్ని విరమింపజేసే ప్రయత్నం ప్రభుత్వం అస్సలు చేయడం లేదు. కార్మికులు అంటే వ్యతిరేకత లేకపోతే.. వారి పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిని ప్రేమే అనుకోవాలా..?