రాజకీయ నాయకులకు ఎన్నికల ప్రచార సమయం ముగిసేలోనే తమ పార్టీ ఎన్నికలలో గెలవబోతోందా లేక ఓడిపోతుందా? అనే విషయంపై ఒక అవగాహన ఏర్పడుతుంది. కానీ అప్పుడు అన్ని పార్టీల నేతలు కూడా తమ పార్టీయే భారీ మెజార్టీతో గెలవబోతోందని చెప్పుకొంటూ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటారు. ఆవిధంగా వ్యవహరించడం చాలా అవసరం కూడా. కానీ ఒక్కోసారి ఎన్నికల ప్రచార సమయంలోనే లేదా పోలింగ్ ముగిసిన వెంటనే వారు చేసే చిన్నచిన్న వ్యాఖ్యలు అసలు విషయాన్ని పట్టిస్తుంటాయి. వరంగల్ ఉప ఎన్నికలలో విజయం సాధించాలానే పట్టుదలతో తెరాస ఎంత కష్టపడిందో, ఎటువంటి వ్యూహాలు అమలు చేసిందో అందరూ చూసారు. ఆ కారణంగా ఈ ఉప ఎన్నికలలో తెరాస గెలిచే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఆ విషయాన్ని తెదేపా తెలంగాణా శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా గ్రహించినట్లే ఉన్నారు. అదే విషయాన్ని దృవీకరిస్తున్నట్లుగా ఆయన మాట్లాడారు.
“ఈ ఉప ఎన్నికలలో తెరాస నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ప్రజలను నయాన్నో భయన్నో లొంగదీసుకొని తెరాసకు ఓట్లు వేయించుకొన్నారు. కొన్ని చోట్ల తెరాస నేతలు ప్రజలను బెదిరించి భయపెట్టి ఓట్లు వేయించుకొంటే మరికొన్ని చోట్ల విచ్చలవిడిగా డబ్బు పంచి పెట్టి ఓట్లు వేయించుకొన్నారు. ఈ ఉప ఎన్నికలలో తెరాస ఏమేమీ చేయకూడదో అవన్నీ చేసి ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేసింది. తెరాస నేతల తీరుని చూసి ప్రజలు కూడా అసహ్యించుకొంటున్నారు. ఈ ఉప ఎన్నికలలో ప్రజలు తెరాసకు గట్టిగా బుద్ధి చెప్పబోతున్నారు,” అని అన్నారు.
నిజానికి ఒక్క తెరాసయే కాదు తెదేపాతో సహా అన్ని రాజకీయపార్టీలు కూడా ఎన్నికలలో గెలవడానికి ఇదే పని చేస్తుంటాయి. కనుక ఎన్నికల ప్రచారానికి-పోలింగ్ కి మధ్య ఉండే కొద్ది పాటి సమయంలో జరిగే ‘ఆ పనులలో’ ఎవరిది పైచెయ్యిగా ఉంటే వారికే విజయావకాశాలు ఉంటాయి. ‘ఆ పనులలో’ వెనుకబడిన మిగిలిన పార్టీలు అప్పుడు ఈవిధంగా అక్రోశిస్తుంటాయి. కనుక ఎర్రబెల్లి చెప్పిన దానిని బట్టి చూస్తే తెరాస గెలుపు ఖాయమని స్పష్టం అవుతోంది. అలాగే ఆయన తమ ఉమ్మడి అభ్యర్ధి డా.దేవయ్య ఓటమిని అంగీకరించినట్లే భావించవచ్చును.