ముఖ్యమంత్రి కేసీఆర్ మాటకారితనం వేరు, ఆయన టైమింగ్ వేరు. ఎంతటి ప్రతికూల పరిస్థితులనైనా కేవలం తన మాటలతో అనుకూలంగా మార్చుకోవడంలో ఆయన సిద్ధహస్తుడు. దానికి ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉదాహరణ. దిష్టిబొమ్మలు తగలేసిన కార్మికులతోనే పాలాభిషేకాలు అందుకున్నారు. ఆయనలాంటి వాక్చాతుర్యం తెలంగాణలో ఇతర నాయకులకు లేదు. లేనిదాన్ని తెచ్చిపెట్టుకుని, అది తన లక్షణమే అన్నట్టు ప్రదర్శనకు దిగితే ఏమౌతుంది..? మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఇలాంటి ప్రయోగమే చేశారు! స్త్రీనిధి పేరుతో మహిళలకు ప్రభుత్వం రుణాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఎర్రబెల్లి మాట్లాడారు. గ్రామాల్లో కూడా షీటీమ్స్ ఏర్పాటు చేసే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనీ, గ్రామీణ ప్రాంతాల్లోనే పసుపు, కారం లాంటివన్నీ తయారు చెయ్యాలన్నారు.
మహిళా శక్తి గురించి ఎర్రబెల్లి మాట్లాడుతూ… ఇంటికి అన్నో, నాయినో వస్తే కోడ్ని కోద్దామన్నా కూడా భర్తను కాకాపట్టాల్సిన పరిస్థితి మహిళలకు ఉండేదన్నారు. కానీ, ఇప్పుడు… భర్తకు ఏదన్నా అవసరం వస్తే భార్యల్ని కాకాపట్టే రోజులు వచ్చాయన్నారు. తన జేబులో లక్ష రూపాయలుంటే ఊరికే ఖర్చైపోతాయనీ, దేనికోసం ఖర్చుపెట్టావని తన భార్య అడిగితే… మంచిపనికే అని చెబుతుంటానని చమత్కరించారు!! పెన్షన్ల గురించి మాట్లాడుతూ… అప్పట్లో రూ. 200 పింఛెన్ ఇస్తున్నప్పుడు అత్తలను కోడళ్లు పలకరించేవారు కాదన్నారు. రూ. 1 వెయ్యి ఇచ్చిన తరువాత… అత్తా బాగున్నావా అని కోడలు అంటోందన్నారు!! ఇక, రూ. 2 వేలు వస్తున్న దగ్గర్నుంచీ అత్తా కాఫీ తాగుతావా, మందులేసుకున్నవా అని కోడళ్లు అడుగుతున్నారని మంత్రిగారు చెప్పారు.
కేవలం ప్రభుత్వం ఇచ్చిన రుణాలతో మహిళల జీవితాల్లో ఇంత మార్పు వచ్చేసిందా, రాష్ట్రంలో మహిళలు ఇంత ఆనందంగా ఉన్నారా, కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితి వచ్చిందా అన్నట్టుగా ఎర్రబెల్లి మాట్లాడారు. వస్తే మంచిదే. కానీ, ఈ రెండు పథకాలకే మహిళలు ఇంత ఆనంద పడిపోతున్నారని చెబుతున్నారే… అదే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తి చేసి అందరికీ ఇచ్చేస్తే ఇంకా ఆనందం డబుల్ అవుతుంది కదా! అందరికీ ఇస్తామని చెప్పి చాన్నాళ్లైపోయింది. కానీ, ఆ పథకం గురించి మాట్లాడరు. ఏమో… ఏదో చమత్కారంగా మాట్లాడే ప్రయత్నం ఎర్రబెల్లి చేశారుగానీ, ఆ ప్రయత్నంలో టైమింగ్ మిస్సయింది. రాసుకున్న స్క్రిప్ట్ చదువుతున్నట్టుగానే అనిపించింది.