హైదరాబాద్: ఎర్రబెల్లి దయాకరరావు నిన్న టీఆర్ఎస్లోకి జంప్ అవటంతో వరంగల్ జిల్లాలో ఇప్పుడొక విలక్షణ పరిస్థితి ఏర్పడింది. బద్ధ శత్రువులైన ఎర్రబెల్లి దయాకరరావు, కడియం శ్రీహరి, కొండా మురళి-సురేఖ దంపతులు ఒకే గొడుగు కిందకు వచ్చినట్లయింది. ముఖ్యంగా వీరు ముగ్గురిలో దయాకరరావుకు మిగిలిన ఇద్దరితో తీవ్ర వైరం ఉంది. ఒకనాడు మిత్రులైన ఎర్రబెల్లి, కొండా మురళి మధ్య తర్వాతికాలంలో విభేదాలొచ్చాయి. ఒకరితో ఒకరికి ప్రాణాలకు ముప్పు ఉందంటూ పరస్పర ఆరోపణలు కూడా చేసుకున్నారు.
ఇక ఎర్రబెల్లికి, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరికి మధ్య అయితే పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఎన్నికలకు ముందే టీఆర్ఎస్లో చేరిన కడియం శ్రీహరిని ఎర్రబెల్లి మీడియాలో ప్రస్తావించలేని భాషలో తిట్లన్నీ తిట్టారు. తాను ఒక తల్లి, తండ్రికే పుట్టానని, కడియంలాగా పదవులకోసం పార్టీలు మార్చనని అన్నారు. మరి ఇప్పుడు వీరిద్దరికీ పొంతన ఎలా కుదురుతుందో అర్థం కావటంలేదు. అసలు ఈ మూడు శక్తులను ముఖ్యమంత్రి ఎలా సమన్వయం చేస్తారో వేచి చూడాల్సిందే. ఈ ముగ్గురూ నాలుగు బలమైన సామాజికవర్గాలకు చెందినవారు కావటం మరో విశేషం. ఎర్రబెల్లి వెలమ కాగా, కొండా మురళి మున్నూరు కాపు, సురేఖ పద్మశాలి, కడియం దళితుడు. ఎర్రబెల్లి ముఖ్యమంత్రి సామాజికవర్గం కావటం ఆయనకు కలిసొచ్చే అంశం అని చెప్పుకోవచ్చు.