గత ఎన్నికల్లో ఓడిపోతామని ముందే చెప్పానని ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పుడు చెబుతున్నారు. వరంగల్ సభ కోసం సన్నాహక సమావేశాలు పెడుతున్న ఆయన .. పాత విషయాలు గుర్తు చేసుకుంటున్నారు. కొత్తగా స్ఫూర్తి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఫ్పై మంది అభ్యర్థులను మారిస్తే గెలుస్తామని గతంలో చెప్పానన్నారు. అయితే కొన్ని సార్లు ఓడిపోవడం కూడా మంచిదేనని సర్ది చెప్పుకున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు .. కేసీఆర్ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత తన అభిప్రాయాలను చెప్పారు. కనీసం ముఫ్పై మంది అభ్యర్థులను మార్చాల్సి ఉందన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించినప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు. సిట్టింగులకే దాదాపుగా చాన్స్ ఇచ్చారు. అతి స్వల్పంగా మార్చారు. ఎన్నికలకు చాలా ముందుగా అభ్యర్థులను ప్రకటించడంతో .. చివరి నిమిషంలో అయినా అభ్యర్థుల్ని మారుస్తారని అనుకున్నారు. కానీ ఒకటి, రెండు మార్పులు తప్ప అంతా వారితోనే బరిలోకి దిగారు. సానుకూల ఫలితాలు రాలేదు. ఎన్నికలు ఫలితాలు వచ్చాక.. కేటీఆర్ కూడా అభ్యర్థుల్ని మార్చి ఉంటే విజయం సాధించి ఉండేవారమని కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఎర్రబెల్లి బాధ కూడా అదే.
అయితే ఇక్కడ అసలు లాజిక్ వేరే ఉంది. మార్చాల్సిన అభ్యర్థుల జాబితాలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నాడా లేదా అన్నది ఆయన చెప్పలేదు. పాలకుర్తిలో తిరుగు లేకుండా గెలుస్తూ వస్తున్న ఆయన తొలి సారిగా ఓడిపోయారు. అది కూడా ఓ ఎన్నారై యువతి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఓడిపోతానని తనకు కూడా తెలుసని ఆయన చెప్పుకొచ్చారు. మరి అప్పుడే తాను కూడా ఓడిపోతానని తనకూ టిక్కెట్ వద్దని ప్రకటించి ఉన్నట్లయితే కేసీఆర్ ఆలోచించి ఉండేవారే్మో ?