నిన్నటిదాకా సవాళ్లు విసిరిన నేత ఇప్పుడు ఏకంగా కండువా రంగునే మార్చుకుంటున్నారు. పసుపురంగు పార్టీకి శాసనసభలో ఫ్లోర్‌లీడర్‌గా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిలోకి చేరడానికి నిశ్చయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఇద్దరూ బుధవారం రాత్రి కేసీఆర్‌ను ఆయన నివాసంలో కలిసి పార్టీలో చేరుతారంటూ వార్తలు వస్తున్నాయి.
ఎర్రబెల్లి దయాకర్‌రావు తెరాసలోకి ఫిరాయించవచ్చుననే ఊహాగానాలు బుధవారం మధ్యాహ్నం నుంచే ఊపందుకున్నాయి. సాయంత్రం ఆయన ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మంత్రి హరీష్‌రావుతో భేటీ కావడంతో దాదాపు ఇది ఖరారైంది.నిజానికి చాలా నెలల కిందటే తెరాసలో చేరాలనుకున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు, అప్పట్లోనే కేసీఆర్‌తో ఒకసారి భేటీ అయి, ఆ పార్టీలో తెదేపాలో ఉన్నంత స్వేచ్ఛ ఉండబోదు అనే ఉద్దేశంతో వెనక్కు తగ్గినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుత వాతావరణంలో తెలంగాణలో తెలుగుదేశం దారుణంగా పతనం అవుతున్న నేపథ్యంలో ఫ్లోర్‌లీడర్ కూడా పార్టీ మారిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాసేపట్లో ఆయన చేరిక అధికారికంగా ఖరారు అవబోతోంది.
ఫిరాయింపుల చట్టానికి తూచ్
ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆయనతోపాటూ మరో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తెరాసలో చేరితే గనుక.. వారి మీద ఎలాంటి క్రమశిక్షణ చర్యలు లేకుండా ఉండడానికి చేరువ అవుతున్నట్లే లెక్క. గత సార్వత్రిక ఎన్నికల్లో తెదేపాకు 15 మంది గెలిచారు. మూడింట రెండొంతుల మంది ఫిరాయిస్తే గనుక.. ఇక ఫిరాయింపుల చట్టం వర్తించే అవకాశం ఉండదు. ఆ నేపథ్యంలో ఇప్పటికి 7 గురు తెదేపా ఎమ్మెల్యేలు ఆల్రెడీ తెరాసలో చేరిపోయారు. ప్రస్తుతం ఎర్రబెల్లి, ప్రకాశ్‌గౌడ్ చేరికతో వారి సంఖ్య 9కు చేరుతుంది. ఇంకా ఒక్క ఎమ్మెల్యే గనుక చేరినట్లయితే.. మొత్తం పరిపూర్ణం అవుతుంది. ఇక ఫిరాయింపుల చట్టమే వర్తించకుండా.. తెలంగాణ తెదేపాను తెరాసలో విలీనం చేసుకున్నట్లుగా ప్రకటించేయడం కుదురుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.