హైదరాబాద్: తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిపై తన కసినంతా వెళ్ళగక్కారు తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు. తాను వద్దన్న మంత్రిపదవిలోనే కడియం శ్రీహరి ఇప్పుడు కొనసాగుతున్నానని విమర్శించారు. ప్రస్తుతం కడియం అనుభవిస్తున్న పదవి తాను పెట్టిన భిక్షేనని అన్నారు. తనపదవినే కడియంకు ధారాదత్తం చేశానని చెప్పారు. తాను ప్రజల మనిషినని అన్నారు. ఒకవేళ తాను మంత్రిని కావాలనుకుంటే ఒక్కనిమిషంకూడా పట్టదని సవాల్ చేశారు. తెలుగుదేశం హయాంలోనూ తనదయవల్లే కడియం శ్రీహరి రెండుసార్లు మంత్రి అయ్యాడని అన్నారు. తన దయవల్ల మంత్రులు అయినవాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పారు. మొన్నకూడా టీఆర్ఎస్ పార్టీ తనను పిలిచి మంత్రిపదవి ఇస్తానంటే తాను వద్దనటంతో దానిని శ్రీహరికి ఇచ్చారని అన్నారు. తాను వద్దనకపోతే శ్రీహరికి మంత్రిపదవి వచ్చేదే కాదని చెప్పారు. మంత్రిపదవి ఇస్తానంటే తాను వెళ్ళలేదనే విషయాన్ని కేసీఆర్ను అడిగినా, ఆయన కుటుంబాన్ని అడిగినా చెబుతారని అన్నారు. దమ్మున్న నాయకుడినని, ప్రతిసారీ గెలుస్తానని చెప్పారు. జిల్లా ప్రజలు తనవెంట ఉన్నారని, కడియంవెంట లేరని అన్నారు. గత ఎన్నికలలో ఎమ్మెల్యేల నిర్వహణవలన ఆయన ఎంపీగా గెలిచాడని విమర్శించారు. తాను కన్నతల్లిలాంటి తెలుగుదేశాన్ని నమ్ముకున్నానని, తనకు ఒక తల్లి, ఒక తండ్రే ఉన్నారని అన్నారు. తాను పార్టీలు మారబోనని చెబుతూ, మంత్రిపదవికోసం పార్టీలు మారే నీకు, నాకు పోటీయా అంటూ కడియంపై ఎర్రబెల్లి నిప్పులు చెరిగారు.
వరంగల్ జిల్లాలో ఈ నేతలిద్దరి మధ్య ఆధిపత్య పోరు ఉన్న విషయం తెలిసిందే. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి త్వరలో ఉపఎన్నిక జరగనుండటంతో ఇరువురిమధ్య మాటలయుద్ధం తీవ్రమయింది. కడియం రేపు ఈ విమర్శలపై ఎలా స్పందిస్తారో చూడాలి.