రియాలిటీకి దగ్గరున్న కథలకు కాస్త ఫిక్షన్, గ్రాండియర్ జోడించడం తెలుగు సినిమా అలవాటు చేసుకొంది. అందులో భాగంగా నిజ జీవిత కథలూ తెరపైకొస్తున్నాయ్. ‘తండేల్’ అలాంటిదే. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. లవ్ స్టోరీ తరవాత ఈ కాంబోలో వస్తున్న సినిమా ఇది. ఈరోజు `తండేల్` ప్రపంచాన్ని ఓ టీజర్‌తో పరిచయం చేసింది చిత్రబృందం.
ఓ జాలరి ప్రేమ కథ ఇది. దేశ భక్తినీ మిళితం చేశారు. అనుకోకుండా పాకిస్థాన్‌లో ప్రవేశించిన హీరోని, అక్కడి ఆర్మీ బంధిస్తుంది. వాళ్ల కబంద హస్తాల్లోంచి.. మళ్లీ ఎలా బయపడ్డాడు? తన ప్రేమని ఎలా కాపాడుకొన్నాడు? అనేదే కథ. ఈ టీజర్లోనే చిత్రబృందం కథ మొత్తం చెప్పేసే ప్రయత్నం చేసింది. రాజు పాత్రలో నాగచైతన్య, బుజ్జి తల్లిగా సాయి పల్లవి కనిపించారు. ”మా నుండి ఊడిపడిన ఒక ముక్క.. మీకే అంత ఉంటే, ఆ ముక్కని ముష్టేసిన మాకెంత ఉండాలి.. భారత్ మాతాకీ జై” అంటూ చైతూ చెప్పిన డైలాగ్ ఈ కథలోని ఇంటెన్సిటీకి అద్దం పడుతోంది. ఈమధ్యే ఈ సినిమా పట్టాలెక్కింది. అంతలోనే రెండు నిమిషాల ఫుటేజీ ఉన్న టీజర్ బయటకు వదిలారంటే.. ఎంత ప్లానింగ్ తో సినిమా తీస్తున్నారో అర్థం అవుతోంది. విజువల్స్, దేవిశ్రీ అందించిన ఆర్.ఆర్ ఇంపాక్ట్ కలిగిస్తున్నాయి. చైతన్య గెటప్ రఫ్ అండ్ టఫ్ గా కనిపిస్తోంది. తన కెరీర్లో ఈ సినిమా గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతున్నామని చిత్రబృందం ప్రకటించింది.