ప్రభుత్వాలు ప్రజల్ని లాక్ డౌన్ కావాలని ఆదేశిస్తున్నాయి. కానీ వారికి నిత్యావసరాలు.. తామే అందిస్తామని భరోసా ఇవ్వలేకపోతున్నాయి. ఫలితంగా మార్కెట్లో అలజడి రేగుతోంది. జనం రోడ్లపైకి వస్తున్నారు. ఇలా రావడం వల్ల.. పరిస్థితులు దిగజారిపోతున్నాయి. కర్ఫ్యూ… లాక్డౌన్ అనే సరికి మధ్యతరగతి ప్రజల మనసుల్లో ముందుగా వచ్చినది కరోనా భయం కాదు. నిత్యావసర వస్తువులే. దేశంలో అత్యధికులు.. ఏ రోజు గడవడానికి ఆ రోజు వస్తువులు కొనుగోలు చేసేవారు ఉంటారు. వారానికి.. నెలకి సరిపడా ఒకే సారి తెచ్చుకునేవారు కూడా ఉంటారు. వీరందరికీ.. ఒక్క సారిగా.. ముందు ముందు రాబోతున్న పరిస్థితులు కళ్ల ముందు కనిపించాయి. అంతే.. తమ దగ్గర ఉన్న సొమ్ము మొత్తాన్ని ఊడ్చి.. నిత్యావసర వస్తవులు తెచ్చుకున్నారు. వారిని చూసి ఇతరులు కూడా.. తామేదో కోల్పోతున్నామన్న భావనకు వచ్చారు. ఫలితంగా…మార్కెట్లో నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడింది.
ఎక్కడ చూసినా.. జనం షాపులమీద పడుతున్నారు. ఇక రేపు లేదు అన్నట్టుగా టన్నులకొద్దీ కూరగాయాలు నిమిషాల్లో ఖాళీ అయిపోతున్నాయి. ఈ కారణంగా రేట్లు పెంపు, బ్లాక్ మార్కెటింగ్ పెరిగిపోయింది. చివరికి ఉప్పు ప్యాకెట్లు కూడా దొరకని పరిస్థితి. సాధారణం ఓ కుటుంబానికి కేజీ ఉప్పు.. రెండు నెలలు వస్తుంది. అంటే.. ఏడాదికి ఆరు ప్యాకెట్లు సరిపోతాయి. అవి కూడా.. ఆరు సార్లు కొంటారు. కానీ ఇప్పుడు.. ఒకే సారి పన్నెండు ప్యాకెట్లు కొనడానికి ఎగబడుతున్నారు. అన్నింటికీ డిమాండ్ ఇలాగే ఉంటుంది. వాటికి తగ్ల సప్లయ్.. ఇప్పటికిప్పుడు ఎలా వస్తుంది. ..? జనం తమకు కావాల్సిన నిత్యావసరాలను నిల్వ చేసుకోకుండా.. కావాల్సినంత వరకే కొనుగోలు చేస్తే.. ఈ సమస్య రాదు. ఈ దిశగా ప్రజల్ని చైతన్య వంతుల్ని చేయాల్సింది ప్రభుత్వమే.
ఇప్పటికైనా ఓ క్రమ పద్దతిలో నిత్యావసరాలు అందుబాటులోకి తెచ్చి.. దాని ప్రకారం.. ఎవరికీ ఇబ్బంది రాకుండా చూసుకుంటామని ప్రజలకు భరోసా ఇస్తే.. బయటకు రాకుండా ఆగిపోతారు. ప్రాణాల కన్నా ఆర్థిక కష్టనష్టాలు పెద్దవేం కాదని ప్రజలు ఇప్పటికే రియలైజ్ అవుతున్నారు. ఇప్పుడు.. లాక్ డౌన్కే కాదు.. తాళాలు వేసుకుని ఇంట్లో ఉండమన్నా.. ఉండటానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ.. వారికి రోజువారీ అవసరాలు మాత్రం తీరాలి. ప్రభుత్వాలు ఈ ఏర్పాట్లను చేయగలిగితే.. వారికి రోడ్ల మీదకు వచ్చే టెన్షన్ కూడా ఉండదు. లాక్డౌన్ సక్సెస్ అవుతుంది. కరోనాను కట్టడి చేయవచ్చు.