పదేళ్లు అధికారంలో కొనసాగి..అనూహ్య ఓటమితో కుంగుబాటుకు గురి అవుతోన్న బీఆర్ఎస్..ఎట్టకేలకు పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెట్టింది. ఈమేరకు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నేతృత్వంలోని ఓ బృందం ఇప్పటికే తమిళనాడులో డీఎంకే సంస్థాగత నిర్మాణంపై స్టడీ చేసి వచ్చింది. తెలంగాణలో బీఆర్ఎస్ బలోపేతం కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలని అనే దానిపై త్వరలోనే కేసీఆర్ కు ఓ నివేదిక సమర్పించనుంది. అనంతరం పార్టీలో కేసీఆర్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించనున్నట్లు సమాచారం.
డీఎంకే లాగే బీఆర్ఎస్ ను బలీయమైన శక్తిగా మార్చాలని అనుకుంటున్నారు. ఇందుకోసం డీఎంకే తరహాలోనే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్మాణం చేపట్టాలని అంచనాకు వచ్చారు. డీఎంకేకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఓ సమన్వయకర్త ఉంటారు. పార్టీ నిర్ణయాల్లో, వ్యవహారాల్లో ఆయన నిర్ణయమే ఫైనల్. ఎమ్మెల్యే జోక్యం అసలే ఉండదు. అలాగే , దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని రీసెర్చ్ వింగ్ డీఎంకేకు మాత్రమే ఉందట.
ఈ రీసెర్చ్ వింగ్ ఎన్నికల సమయంలో, పార్టీకి ప్రతికూల సమయంలో పార్టీకి కొత్త ఊపు తెచ్చేలా ఉపయోగపడుతుందని అంటున్నారు. ఈ క్రమంలోనే పార్టీని పటిష్టం చేసేందుకు డీఎంకే తరహాలోనే బీఆర్ఎస్ కోసం నియోజకవర్గానికి ఓ కో ఆర్డినేటర్, అలాగే రీసెర్చ్ వింగ్ తీసుకురావాలని బాల్క సుమన్ నేతృత్వంలోని బీఆర్ఎస్.. కేసీఆర్ కు సిఫార్సు చేసే అవకాశం ఉంది.