ఆర్థికంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న ప్రభుత్వం బయటపడటానికి మార్గాలను వెదుక్కుంటోంది. నిపుణుల సలహాల కోసం ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో చాలా మందికి కమిషన్లు ఇచ్చి సలహాలు తీసుకున్నా అవన్నీ అప్పుల కోసమే. ఇప్పుడు కొత్తగా ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి సాధించిన ఎస్తేర్ డఫ్లో అనే నిపుణురాలిని సూచనలు, సలహాలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్తేర్ డఫ్లో కు 2019లో మరో ఇద్దరితో కలిసి నోబెల్ బహుమతి లభించింది. ఆ ఇద్దరిలో ఒకరు భారత్కు చెందిన అభిజిత్ బెనర్జీ. ఆమె భర్తనే.
పేదరికంపై ప్రత్యేక అధ్యయనాలు చేయడంలో చేస్తారు. మసాచుసెట్స్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. ఎస్తేర్ డఫ్లో ఏపీ సీఎం జగన్ను కలిశారు. తాడేపల్లిలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నగదు బదిలీ పథకాలపై చర్చ జరిగింది. ప్రజల్ని ఎలా పేదరికం నుంచి బయటపడేయాలన్నదానిపై వీరి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని.. అవి ప్రజల బతుకులు మార్చాలంటే ఏం చేయాలన్నదానిపై ఎస్తేర్ డఫ్లో సలహాలు ఇచ్చే అవకాశం ఉంది.
అలాగే ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకోవడానికి ఏం చేస్తారో కూడా సూచనలు ఇచ్చే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వంతో ఎస్తేర్ డఫ్లో కలిసి పని చేస్తారని ప్రభుత్వం ప్రకటించింది.అయితే అధికారికంగా ఎలాంటి భాగస్వామ్యం అనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఎస్తేర్ డఫ్లో ఇచ్చే సలాహాలతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో అయినా పరిస్థితి మెరుగుపడుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.